
చెన్నై: శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓటమిని ఎలా తీసుకోవాలో తెలియడం లేదన్నాడు. ఆరంభంలో తమ ఆట బాగున్నా, చివరకు వచ్చేసరికి తేలిపోవడం గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. కేన్ విలియమ్సన్ గాయం గురించి ఫిజియోస్‌తో మాట్లాడాలని, అతడు జట్టులో పెద్ద పాత్ర పోషిస్తాడని వార్నర్ పేర్కొన్నాడు. వార్నర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
'ఓటమి చాలా నిరాశపరిచింది. దీనిని ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు. నేను, బెయిర్‌స్టో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సెట్ చేశాం. కానీ దాన్ని కడవరకూ కొనసాగించలేకపోయాం. చివర్లో బ్యాటింగ్ సరిగా లేకపోతే గెలవలేం. అదే పదే పదే రుజువువతోంది. జట్టుకు మిడిల్ ఆర్డర్ సమస్య ఎప్పటినుంచో ఉంది. సరైన ఆటగాడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు.
'నేను చివరి వరకు క్రీజ్‌లో ఉండాలనే అనుకున్నా. అది నా గేమ్ ప్లాన్. కానీ హార్దిక్ పాండ్యా అద్భుతమైన త్రో కారణంగా రనౌట్ అయ్యా. ఇది ఛేజింగ్ చేసే టార్గెట్. భాగస్వామ్యాలు నమోదు చేసి.. కనీసం మా ఇద్దరిలో (బెయిర్‌స్టో) ఒకరం చివర వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. గేమ్ ప్లాన్ ఇదే. మనం చేజింగ్ చేసే క్రమంలో మిడిల్ ఆర్డర్‌లో స్మార్ట్ క్రికెట్ ఆడాలి. ఈ స్లో వికెట్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. గత వికెట్ కంటే ఈ వికెట్ బాగుంది. తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. చివర వరకూ బ్యాటింగ్ కొనసాగించే విధంగా ఉండాలి. విలియమ్సన్ గాయం గురించి ఫిజియోస్‌తో మాట్లాడాలి. అతడు జట్టులో పెద్ద పాత్ర పోషిస్తాడు' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ పేసర్ టీ నటరాజన్‌కు మోకాలి గాయం అయింది. ఈ విషయాన్ని ఆ జట్టు టీమ్ మెంటార్ వీవీఎస్ లక్షణ్ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌కు నటరాజన్‌ను పక్కన పెట్టడంపై పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై మ్యాచ్ తర్వాత లక్ష్మణ్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఆడటానికి నటరాజన్ ఫిట్‌గా లేడని, అతడి ఎడమ మోకాలి గాయమైందన్నాడు. అందుకే అతని స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను తీసుకున్నామని స్పష్టం చేశాడు.