లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. భారత్‌ను అవమానపరిచేలా ఉన్నవాళ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతేగాక మాల్దీవులకు వెళ్లకుండా మన దేశంలోని అందమైన బీచ్‌లకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా టూరిజం గురించి మాట్లాడాడు. ఓ కార్యక్రమానికి హాజరైన ధోనీని ఓ మహిళ.. విహారయాత్రలకు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించింది. దీనికి ధోనీ ఇలా బదులిచ్చాడు. '' నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను. అయితే అవన్నీ విహారయాత్రల కోసం కాదు. క్రికెట్‌లో భాగంగా విదేశాలకు వెళ్లాను. కానీ అక్కడ ప్రదేశాలేమి చూడలేదు. క్రికెట్ ఆడి తిరిగి వచ్చేవాడిని. సరదాగా గడిపేవాడిని కాదు''

''కానీ నా భార్య ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. నాకు సమయం దొరికినప్పుడు మేం వెళ్లాలని భావిస్తున్నాం. అయితే మేం ఇండియా నుంచే మొదలుపెడతాం. మన దేశంలో ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇతర దేశాలకు వెళ్లే కంటే ముందే తొలుత భారత్‌లోని పర్యటిస్తాం'' అని ధోనీ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మాల్దీవుల వివాదం ఏంటి?
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించారు. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సముద్ర తీరాన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ''లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయా. అక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సాహసాలు చేయాలనుకునేవారు లక్షద్వీప్‌ను కూడా వీక్షించండి'' అని మోడీ ట్వీట్ చేశారు.
దీంతో తమ పర్యాటర రంగానికి ప్రభావం చూపిస్తుందని భావించిన మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. పర్యాటకంలో తమ దేశంతో భారత్ పోటీ పడలేదని నోరు జారారు. మాల్దీవులు అందించే సర్వీస్, పరిశుభ్రత అందించలేరని, ఇండియా గదుల్లో దుర్వాసన వస్తుందని అతిగా వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్‌లోని ప్రముఖ బీచ్‌లను ప్రస్తావిస్తూ సెలబ్రెటీలు, నెటిజన్లందరూ పోస్ట్‌లు పెట్టారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హార్దిక్ పాండ్య కూడా ట్వీట్ చేశారు.