'కోహ్లీ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయి, వేరేలా స్పందించాల్సింది'


హైదరాబాద్: ఓ అభిమాని పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. తన పుట్టినరోజు సందర్భంగా తన పేరిట యాప్ విడుదల చేసిన అనంతరం అభిమానులతో కోహ్లీ కాసేపు చిట్ చాట్ చేశాడు.
ఈ సందర్భంగా కోహ్లీ ఓ అభిమానిని "దేశం విడిచి వెళ్లిపో" అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ "కోహ్లీ ఇలా మాట్లాడుతాడనుకోలేదు. గత 18-24 నెలలుగా అతని మాటల్లో పరిణితి కనిపించింది" అని అన్నాడు.

చాలా ఇంటర్యూలో కోహ్లీ హుందాగా మాట్లాడాడు
"అన్ని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూల్లో చాలా హుందాగా మాట్లాడాడు. కానీ, అతని తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనేం మాట్లాడాడో ఆ మాటలు ఆహ్వానించదగినవి కావు. అవి నిరాశ పరిచినవి. మనకేం కావాలో దానిపై మాత్రమే మాట్లాటం భావ వ్యక్తీకరణ. కోహ్లీ వేరేలా స్పందించాల్సింది. ఈ తరహా వ్యాఖ్యలను కోహ్లీ కూడా సమర్ధించుకోడు" అని చెప్పాడు.
అసలేం జరిగింది?
నవంబర్ 5 విరాట్ కోహ్లీ 30వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన పేరిట ఓ యాప్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా కోహ్లీ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదమైంది. ఓ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ‘‘ఓవర్‌రేటెడ్ ప్లేయర్'' అని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ ఓ ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతనిలో నాకు ఏదీ ప్రత్యేకంగా కనిపించదు. ఇండియా వాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ నాకు ఎంతో నచ్చుతుంది'' అని పేర్కొన్నాడు.

నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు
ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ ‘‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఎక్కడికైనా వెళ్లి బతుకు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. వేరే దేశాలను ప్రేమిస్తూ.. ఇక్కడ ఎందుకు ఉండటం. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు. నీకు ఈ దేశం సరైంది కాదు. కానీ ఇక్కడ ఉంటూ వేరే దేశాన్ని పొగడటం నాకు ఇష్టం ఉండదు'' అని అన్నాడు.
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ
కోహ్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇతర దేశాల క్రికెటర్లను ఇష్టపడటం వ్యక్తిగత అభిప్రాయమని.. ఆ మాత్రనికి దేశం వదిలి వెళ్లమని అనడం సరైంది కాదని నెటిజన్లు అంటున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. "నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. నాపై ఇటువంటి కామెంట్లు రావడం కొత్త కాదు. ‘ఈ భారతీయులు' అంటూ ఓ అభిమాని చేసిన వ్యాఖ్య పట్ల మాత్రమే నేను అలా మాట్లాడాను. నేను మీ అందరికి ఉన్న స్వేచ్ఛను గౌరవిస్తాను. ఈ విషయాన్ని తేలికగా తీసుకోండి. పండుగ పూట ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకుండా సరదాగా గడపండి. మీ అందరూ ఎంతో ప్రేమ, శాంతితో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications