'అది చూసి ఆశ్చర్యపోయా, కోహ్లీ స్లెడ్జింగ్‌కు బెదరడు'


హైదరాబాద్: టీ20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయిందని వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ అన్నారు. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విండీస్ క్రికెట్, ప్రపంచ క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా క్రికెటర్లకు లీగుల్లో ఆడడంపై కొన్ని పరిమితులు అవసరమని ఆయన సూచించారు. "టీ20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. అఫ్గనిస్థాన్ వంటి దేశాలు కూడా లీగ్‌లను నిర్వహిస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లీగ్‌ల్లో ఆడడంపై క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లకు పరిమితి విధించాలి. అదే సమయంలో ఆటగాళ్లకు బోర్డు తగినంత డబ్బు అందించాలి. ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి" అని అన్నారు.
ఇక, టెస్టు క్రికెట్‌ను కాపాడాల్సిన బాధ్యత ఐసీసీపై ఉందని అన్నారు. "అప్పట్లో కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూడడానికి 80 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. 1974లో బెంగళూరులో మ్యాచ్‌తో అరంగేట్రం చేశా. ఆ రోజు స్టేడియంలో వెస్టిండీస్‌లో కన్నా ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్నారు. అది చూసి నేను ఆశ్చర్యపోయా" అని అన్నారు.

భారత్‌లో గర్వంగా అనిపించింది
"క్రికెట్‌ను ఆరాధించే దేశంలో ఆడుతున్నందుకు గర్వంగా అనిపించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్‌కు ఎక్కువ గౌరవం ఉంది. టెస్టులు చాలా సొగసైనవి. క్రికెట్ బోర్డులు టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచడానికి ప్రయత్నించాలి. వాటి విలువను గుర్తించాలి. వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్‌లు నిర్వహించాలి. టెస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది" అని రిచర్డ్స్ అన్నారు.

బాల్ టాంపరింగ్ ఘటన వల్ల క్రికెట్‌కు చెడ్డపేరు
బాల్ టాంపరింగ్ ఘటన వల్ల క్రికెట్‌కు చెడ్డపేరు వచ్చిందని అన్నాడు. ఎవరూ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించకూడదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా, బాన్‌క్రాప్ట్‌కు తొమ్మిది నెలలు నిషేధం విధించింది.

టీమిండియాకే ఎక్కువ గెలిచే అవకాశాలు
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టీమిండియాకే ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయని రిచర్డ్స్ అన్నారు. "గత భారత కెప్టెన్లంతా ఆస్ట్రేలియాలో విజయం సాధించడానికి ప్రయత్నించారు. కపిల్‌దేవ్, గావస్కర్ లాంటి వాళ్లు అక్కడ విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పటిష్టంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.

భారత్ అన్ని కోణాల్లో బలంగా
"జట్టు అన్ని కోణాల్లో బలంగా కనిపిస్తోంది. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. కష్టపడితే సిరీస్ కైవసం చేసుకోవచ్చు. ఇప్పుడు భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. స్లెడ్జింగ్‌కు కూడా బెదరడు. బ్యాట్‌తో, నోటితో మాత్రమే ప్రత్యర్థులకు గట్టిగా జవాబిస్తాడు" అని వివ్ రిచర్డ్స్ తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications