
హైదరాబాద్: ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు అండర్ 19లో ప్రపంచ కప్ గెలుచుకున్న అందరినీ ఆశ్యర్యపరిచింది. దీంతో కప్ విజేతలైన కుర్రాళ్లపై పొగడ్తల వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో మెరిసిన మన్‌జోత్ కల్రాను స్టార్ క్రికెటర్లతో పోలుస్తున్నారు.
భారత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లతో పోల్చుతుండటంతో అంతటి వాడిని కాదని పోల్చవద్దని కోరుకుంటున్నాడు మన్‌జోత్ కల్రా.. కానీ, అతని బ్యాటింగ్ శైలి విరాట్, యువీలను పోలి ఉందంటూ అతని అభిమానులు తెగపొగిడేస్తున్నారు.
ఫైనల్లో కల్రా ఇన్నింగ్స్ చూసిన అభిమానులు అప్పటి నుంచి విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌తో పోల్చుతున్నారట. దీనిపై అతడు తాజాగా స్పందించాడు. 'దయచేసి నన్ను కోహ్లీ, యువీలతో పోల్చొద్దు. వారు దిగ్గజ ఆటగాళ్లు. నేను ఇప్పుడిప్పుడే క్రికెట్లో కీలక అడుగులు వేస్తున్నాను. ఇలాంటి సమయంలో నన్ను వారితో పోల్చి ఒత్తిడికి గురి చేయవద్దు' అని కల్రా కోరాడు.
'టోర్నీ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా సాయం చేశారు. పరిస్థితులను అర్థం చేసుకుని మాకు ఎంతో వివరణాత్మకంగా మెలకువల చెప్పేవారు. మేము ఆశించిన దాని కంటే ఎక్కువగా అందరి నుంచి మాకు మద్దతు దక్కింది. ప్రపంచకప్ అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని కల్రా వివరించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.