అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయిదు దశాబ్దాల నాటి కల సోమవారం సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అయితే ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు అతిరథ మహారథులు అయోధ్యకు నిన్న తరలి వెళ్లారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, వెంకటేశ్ ప్రసాద్‌తో పాటు ఇతర క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ గోపీచంద్, ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలరాముడిని దర్శించుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మరోవైపు ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం దక్కినప్పటికీ కొందరు క్రికెటర్లు అయోధ్యకు రాలేదు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్ వంటి ప్రముఖులు హాజరు కాలేదు. అయితే కోహ్లి డూప్లికేట్ ఒకరు అయోధ్యకు రావడంతో సెల్ఫీల కోసం జనం అతడి వెనుకపడ్డారు. విరాట్ కోహ్లి డాపిల్‌గాంగర్‌గా కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వారిలో కొందరు చాలా సార్లు స్టేడియానికి కూడా వచ్చి ఫేమస్ అయ్యారు.
అందులో ఒకరు సోమవారం అయోధ్యకు వచ్చాడు. కోహ్లిలా హెయిర్‌స్ట్రైల్, గడ్డంతో టీమిండియా జెర్సీ ధరించి వచ్చాడు. దీంతో జనం అతడిని కోహ్లిగా భావించి ఫొటోలు కోసం ఎగబడ్డారు. మరికొందరు కోహ్లి డూప్లికేట్ అని తెలిసి కూడా సెల్ఫీల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో అతడి చుట్టూ ఓ తోపులాట జరిగింది. కొందరు అతడిని, అతడి చొక్కాను పట్టుకొని నలిపేశారు. అసలైన కోహ్లిని కాదని, అక్కడ ఉన్న జనంతో అతడు సహనంగా వివరించినప్పటికీ లాభం లేకపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కాగా, ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో అతడు జట్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. అయితే తొలి టెస్టు కోసం కోహ్లి ఆదివారమే హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కానీ అదే రోజు రాత్రి తిరిగి బయలుదేరాడు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కోహ్లి వెళ్లాడని భావించారంతా. కానీ అయోధ్య వేడుకలో కోహ్లి ఫొటోలు బయటకు రాకపోవడంతో అతడు రాలేదని తర్వాత నిర్ధారించుకున్నారు. ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు గురువారం ప్రారంభం కానుంది.