అతడే నాకు స్ఫూర్తి: కోహ్లీ మనసులో మాట ఇదే
హైదరాబాద్: ఆట పట్ల అంకిత భావం విషయంలో వరల్డ్ అత్యుత్తమ పుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డోను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్టు (ఈసీబీ)కి ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ప్రతీ క్రికెటర్‌కు లోపాలనేవి సహజమని, వాటిని అధిగమించేందుకు తీవ్రంగా కష్టపడ్డవారే నిలకడగా రాణించగలుగుతారని కోహ్లి అభిప్రాయపడ్డాడు. గతంలో కంటే ఇప్పుడు తన ఆటను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతున్నానని, తన లోపాలను, బలహీనతలను సరిదిద్దుకున్న తర్వాత తన సామర్థ్యంపై పూర్తి నమ్మకం వచ్చిందని తెలిపాడు.
గతేడాది కోహ్లీ అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 2016 మొత్తంగా చూస్తే 35 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి టెస్టుల్లో 1,215 పరుగులు చేయగా... మూడు ఫార్మెట్లలో కలిపి 2,500కు పైగా పరుగులు నమోదు చేశాడు. ఇదంతా తన ఆటతీరును మరింత అర్థం చేసుకోవడంతోనే సాధ్యమైందని తెలిపాడు.

లోపాలను సరిచూసుకోవడం వల్లే
'బలం బలహీనతలను చాలా బాగా అర్థం చేసుకున్నా కాబట్టే బాగా ఆడగలుగుతున్నా. ఈ రెండింటి మధ్య సమతుల్యం తీసుకురావడం చాలా ముఖ్యం. లోపాలను సరిచూసుకోవడంతో పాటు నా బలమేమిటో కూడా అర్థం చేసుకున్నాను. అయితే నాలో ఎలాంటి లోపాలు లేవని అభిమానులు భావిస్తారు. కానీ అది సరికాదు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. అయితే వాటిని గుర్తించగలిగితేనే నిలకడ సాధ్యమవుతుంది. అందుకే టెస్టుల్లో నేను భారీగా పరుగులు సాధించాను' అని అన్నాడు.

క్రిస్టియానో రొనాల్డోను ప్రేరణగా తీసుకున్నా
ఈ విషయంలో తాను స్టార్ పుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డోను ప్రేరణగా తీసుకున్నానని చెప్పాడు. ‘కొన్నేళ్లుగా రొనాల్డో అగ్ర ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అది కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. ఫుట్‌బాలర్లందరిలోకెల్లా ఎక్కువ కష్టపడే ఆటగాడు రొనాల్డోనేనని విన్నాను. ఆటలో మెస్సి మేధావి. కానీ తన అంకిత భావంతో రొనాల్డో అతడికి దీటుగా నిలుస్తున్నాడు. అతడే నాకు స్ఫూర్తి' అని కోహ్లి అన్నాడు.

ఒత్తిడి నుంచి దూరంగా పారిపోవడం ఎవరికీ సాధ్యం కాదు
ఇక ఒత్తిడి నుంచి దూరంగా పారిపోవడం ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ఒత్తిడి అనేది పరిస్థితిని బట్టి ఉంటుందని కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్లిప్‌లో నలుగురు ఫీల్డర్లు ఉంటారు. దాన్ని ఒత్తిడిగా భావిస్తే బౌండరీ కొట్టలేమని, కొన్నిసార్లు అదనపు ఒత్తిడి కూడా మనపై ఉంటుందని అన్నాడు.

కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలవడం ఇష్టం
కాబట్టి దీని నుంచి పారిపోకుండా ఒత్తిడిని తాను ఆస్వాదించడం మొదలుపెట్టానని చెప్పాడు. ముఖ్యంగా మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలవడం తనకు ఎంతో ఇష్టమని చెప్పిన కోహ్లీ అలాంటి పరిస్థితికి తలొగ్గితే అపజయం మనల్ని వెంటాడుతుందని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications