
అదే నాకు వచ్చిన సమస్య:
ఐర్లాండ్‌తో టీ20 అనంతరం కోహ్లీ మాట్లాడుతూ...‘ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా అన్ని విభాగాల్లో బ్యాలెన్సింగ్‌గా కనిపించింది. ఇప్పుడు ఇదే నాకు పెద్ద తలనొప్పిగా మారింది. రెండు గేముల్లో భారత్ జట్టు అన‍్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. అంతా బ్యాట్‌తో, బాల్‌తో రాణించారు. ఇది జట్టు సమతుల్యతకు నిదర్శనం. ఇక్కడే నాకు ఒక సమస్య వచ్చి పడింది. తదుపరి గేములకు ఎవర్ని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు.'

తర్జన భర్జనలు తప్పడం లేదు
'ఇదొక మంచి సమస్యగానే పరిగణిస్తున్నా. భారత క్రికెట్ ప్రస్తుతం మంచి ఫేజ్‌లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లు సైతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మన రిజర్వ్ బెంచ్ కూడా చాలా బలంగా ఉండటంతో జట్టు ఎంపికపై తర్జన భర్జనలు తప్పడం లేదు' అని కోహ్లి తెలిపాడు.

బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏది చేయడానికైనా
మరొకవైపు ఇంగ్లండ్ పర్యటనపై కోహ్లి మాట్లాడుతూ.. ‘ప్రత్యర్థి ఎవరన్న దాని గురించి మేము ఆలోచించం. ఐర్లాండ్ లానే ఇంగ్లాండ్. మా దృష్టంతా మా బలం ఏమిటన్న దానిపైనే. టీమిండియాలో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. ఇది మాకు కలిసొచ్చే అంశం. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్‌లు సవాలుతో కూడుకున్నవే. ప్రస్తుతం ఇంగ్లాండ్ కూడా మంచి స్థితిలోనే ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచుల్లో బ్యాటింగ్ లేదా బౌలింగ్ ముందు ఏది చేయడానికైనా సిద్ధమే' అని కోహ్లీ తెలిపాడు. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.

143 పరుగుల తేడాతో భారత్ విజయం
ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకున‍్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 143 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను దిగ్విజయంగా ముగించింది. ఇప్పుడు అదే ఊపుతో ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది విరాట్ అండ్ గ్యాంగ్.


Click it and Unblock the Notifications
