ముంబై: భారత క్రికెట్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తావన లేకుండా ఉండటం.. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందని బాలీవుడ్ నటి, ఎన్‌హెచ్ 10 నిర్మాత అనుష్క శర్మ అన్నారు. కోహ్లీ పేరు లేకుండా న్యూస్ హెడ్ లైన్స్‌లో తన పేరు వస్తుందని ఆమె అన్నారు. ఇది సంతోషించదగ్గ విషయమన్నారు.
అనుష్క శర్మ ఎన్‌హెచ్ 10 సినిమాను నిర్మించారు. ఇది హిట్ టాక్ తెచ్చుకుంది. విజయవంతంగా నడుస్తోంది. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం తనకు డబుల్ ట్రీట్ అని ఆమె చెబుతున్నారు. నిర్మాతగా ఆమెకు ఇది తొలి సినిమా.
ఎన్‌హెచ్ 10 సినిమా విజయవంతం నేపథ్యంలో ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే ధైర్యం వచ్చిందన్నారు. డిఫరెంట్ చిత్రం తీశామని, దానిని ప్రేక్షకులు ఆదరించారని చెప్పారు. కమర్షియల్‌గా సినిమా బాగా నడుస్తోందన్నారు. ఎన్‌హెచ్ 10 సక్సెస్ నేపథ్యంలో.. కోహ్లీ ప్రస్తావన లేకుండా న్యూస్ హెడ్ లైన్స్ ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆమె చెబుతున్నారు.

కాగా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటిస్తున్నారు. ఎన్‌హెచ్ 10 సక్సెస్ ఆనందంలో ఉన్న అనుష్క.. త్వరలో ఆస్ట్రేలియా వెళ్లి కోహ్లీతో కొంత సమయం గడపనుందని తెలుస్తోంది.
సమాచారం మేరకు... అనుష్క శర్మ తన బాంబే వెల్వేట్ చిత్రం ట్రయలర్ లాంచ్‌ను వాయిదా వేసింది. అందుకు ఆస్ట్రేలియా వెళ్లడమే కారణమని అంటున్నారు. భారత్ ఫైనల్ చేరుకుంటే.. ప్రపంచ కప్ ముగిసే దాకా అనుష్క రాకపోవచ్చు. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతున్న భారత్‌కు, తన ప్రియుడు కోహ్లీకి ఆమె చీర్స్ చెప్పేందుకు ఆతృతతో ఉన్నారని అంటున్నారు.