హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాక్ పేసర్ మహమ్మద్ అమీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ కోహ్లీయేననీ అతడికి బౌలింగ్ చేయాలంటే శక్తి మేరకు బంతులు సంధించాల్సిందేనని అమీర్ వ్యాఖ్యానించాడు.
వివరాల్లోకి వెళితే...
దీపావళి పండుగను పరుస్కరించుకుని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హోస్ట్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా జీ టీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆదివారం ప్రసారమైన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమీర్ ఖాన్... కోహ్లీని మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు గాను కోహ్లీ తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లు ఇద్దురు ముగ్గురున్నారని చెప్పిన కోహ్లీ, తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలింగ్ మాత్రం మహహ్మద్ అమీరేనని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు అమీర్ ఓ గొప్ప బౌలర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు.
'ఈ మధ్య కాలంలో పాక్ పేసర్ అమిర్ బాగా రాణిస్తున్నాడు. ప్రపంచంలోని ఇద్దరు ముగ్గురు టాప్ బౌలర్లలో అతడు కూడా ఒకడు. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లలో అమీర్ కూడా ఉన్నాడు. అతని బౌలింగ్‌లో 'ఏ' క్లాస్‌గా ఆడాల్సిందే.. లేకుంటే మనల్ని పడగొట్టేస్తాడు. ఔట్ స్టాండింగ్.. నిస్సందేహంగా అతడు మంచి బౌలర్' అని కోహ్లీ అన్న సంగతి తెలిసిందే.
కోహ్లీ వ్యాఖ్యలపై తాజాగా అమీర్ స్పందించాడు. 'కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అతడి బౌలింగ్ వేసేటప్పుడు మీ శక్తిమేర బంతులు విసరాల్సిందే. ఒకవేళ అతడికి గనుక చాన్స్ ఇస్తే, ఆటమొత్తం తనవైపు తిప్పేసుకుంటాడు. ఢాకా వేదికగా జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ అదే చేశాడు' అని అమీర్ పేర్కొన్నాడు.
అందుకే భారత్‌తో మ్యాచ్ అంటేనే కోహ్లీపై తాను ప్రత్యేకంగా దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చాడు. 'కోహ్లీకి అత్యుత్తమ స్ట్రయిక్ రేటింగ్ ఉంది. ఇక చేజింగ్‌లో కూడా మంచి యావరేజ్ ఉంది. అందుకే ప్రపంచంలోని బౌలర్స్ అందరికీ కోహ్లీ ఓ పెద్ద సవాల్' అని మహమ్మద్ ఆమీర్ పేర్కొన్నాడు.
మోడ్రన్ డే బ్యాటింగ్ దిగ్గజాల్లో రోహిత్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ.. వీరిలో బెస్ట్ ఎవరిని అడిగితే అందరూ మంచి ఆటగాళ్లే కానీ తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం కోహ్లీ బెస్ట్ అని ఆమీర్ ట్వీట్ చేయడం విశేషం. మహ్మద్ ఆమీర్ గతంలో కూడా సందర్బం వచ్చినప్పుడల్లా కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకునే వాడు.