ముంబై: కొత్త హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి ముందుకు వెళ్తానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం చెప్పాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది. ఈ రోజు శ్రీలంక బయలుదేరనుంది.
పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సారథి కోహ్లీతో కలిసి తొలిసారి భారత నూతన ప్రధాన కోచ్ రవిశాస్త్రి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడాడు.
గతంలో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు మంచి ప్రదర్శన కనబరిచి సిరీస్‌ను దక్కించుకున్నామని, ఇప్పుడు కూడా అదే తరహాలో సిరీస్‌లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నామన్నాడు.

అనంతరం కోచ్-సారథి సంబంధంపై అడిగిన ప్రశ్నకు తన చేతిలో బ్యాట్ మాత్రమే ఉంటోందని, తన దృష్టంతా వీలైనంత మెరుగ్గా బ్యాటింగ్ చేయడం, సారథిగా జట్టును నడిపించడమని, మన చుట్టు పక్కల ఎన్నో వార్తలు చక్కెర్లు కొడుతుంటాయని, వాటన్నింటినీ పట్టించుకోవల్సిన అవసరం లేదన్నాడు.
గతంలో రవిశాస్త్రితో కలిసి మూడు సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉందని, అతని నుంచి పూర్తి సహకారం అందుతోందని భావిస్తున్నట్లు చెప్పాడు.
అంతకుముందు రవిశాస్త్రి మాట్లాడాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లేలు, రవిశాస్త్రీలు వచ్చి పోతూ ఉంటారని, కానీ టీమిండియా జట్టు మాత్రం ఎప్పటికీ స్థిరమైనదన్నాడు.
ఈ పర్యటనకు తాను ఎలాంటి లగేజీ తీసుకువెళ్లడం లేదని, భారత జట్టుతో మాత్రమే వెళ్తున్నానని చెప్పాడు. భరత్ అరుణ్ గురించి అడిగిన ప్రశ్నకు కోచ్‌గా అతనికి మంచి వ్యక్తిగత రికార్డు ఉందని, సుమారు 15 సంవత్సరాలుగా కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడని, అతని హయాంలో మన ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తారన్న నమ్మకం ఉందన్నాడు.