
ముంబై జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ నేటి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో హాఫ్ సెంచరీ చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. తిలక్ వర్మ 43బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 51పరుగులు చేశాడు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ 9బంతుల్లో 19పరుగులు చేసి ముంబై స్కోరును 150దాటించాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా గురువారం డివై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది.
తొలి ఓవర్లోనే ముంబైకి చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి షాకిచ్చాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్‌లను డకౌట్ చేశాడు. అలాగే డెవిన్ బ్రెవిస్(4)ను ఔట్ చేశాడు. ముంబై బ్యాటర్లు పూర్తి టెన్సన్‌లో ఆడుతున్నట్లు కన్పించింది. సూర్యకుమార్ కాసేపు బానే ఆడినట్లు కన్పించినా.. సాంట్నర్ బౌలింగ్లో ముఖేష్ చౌదరికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతను 21బంతుల్లో 32పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన హ్రితిక్ సోకిన్ పూర్తి ఒత్తిడిలో కన్పించాడు. అతను సాంట్నర్ వేసిన బౌలింగ్లో బంతిని గాల్లోకి లేపగా.. రవీంద్ర జడేజా సింపుల్ క్యాచ్‌ను వదిలేశాడు. అంత మంచి లైఫ్ వచ్చినా ఈ కొత్త బ్యాటర్ మాత్రం సరిగా వినియోగించలేకపోయాడు. అలాగే ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డర్లు మొత్తం నాలుగు క్యాచ్‌లు జార విడిచారు. అందులో రెండు కెప్టెన్ జడేజానే జారవిడవడం గమనార్హం. ఇక ఇన్ని లైఫ్‌లు వచ్చినా కూడా ముంబై బ్యాటర్లు ఆ లైఫ్‌లను సరిగా సద్వినియోగపరుచుకోలేదు. ఇక కీరన్ పొలార్డ్ (14పరుగులు 9బంతుల్లో) తన ఫామ్‌లేమిని కొనసాగించాడు.

చెన్నై బౌలర్లు మొదటి నుంచి ముంబైని డామినేట్ చేశారు. తొలి ఓవర్లోనే ముఖేశ్ చౌదరి ముంబైని కోలుకోలేని దెబ్బతీయగా.. చెన్నై బౌలర్లు తదనంతం రెగ్యులర్ ఇంటర్వెల్లో వికెట్లు తీశారు. చెన్నై బౌలర్లలో సాంట్నర్ 1, మహేష్ తీక్షణ 1 వికెట్ తీయగా.. డ్వేన్ బ్రావో 2 వికెట్లు, ముఖేశ్ చౌదరి 3వికెట్లు తీశారు. ముఖేశ్ చౌదరి (3-0-19-3), తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 2వికెట్లు తీసిన బ్రావో పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు.