రాయపూర్: సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ దిశగా ముందడుగు వేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ పైన గెలిచి, ఆరో విజయంతో అవకాశాలను మెరుగుపర్చుకుంది. శనివారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైన సన్ రైజర్స్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది.
పదకొండు మ్యాచుల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. మరో మూడు ఆడాల్సి ఉంది. అవి మూడు సొంత గడ్డ పైనే ఆడాల్సి ఉంది. కాబట్టి ప్లేఆఫ్‌కు హైదరాబాద్ చేరుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హెన్రిక్స్ సమయోచిత బ్యాటింగ్‌తో టోర్నీలో ఆరో విజయంతో సన్‌రైజర్స్ నాకౌట్ రేసులో నిలిచింది. ఇక ఎనిమిదో ఓటమితో ఢిల్లీకి ప్లేఆఫ్ దారులు మూసుకుపోయాయి.

గత మ్యాచ్‌లో పటిష్ట రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చిన హైదరాబాద్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసింది. హెన్రిక్స్ (46 బంతుల్లో 74 నాటౌట్) విజృంభణతో ఢిల్లీపై హైదరాబాద్ నెగ్గింది. తొలుత సన్‌రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేసింది.
కేదార్ జాదవ్ (63 నాటౌట్), డికాక్ (50) పోరాడినా ఓటమి తప్పలేదు. హెన్రిక్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. ఆరంభంలోనే ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ (0)ను భువనేశ్వర్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ డికాక్ మాత్రం సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
ఈ క్రమంలో అతను 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి అతణ్ణి స్పిన్నర్ కరణ్ శర్మ వెనక్కి పంపాడు. దీంతో రెండో వికెట్‌కు డికాక్ - డుమినీ 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ (2)ను రసూల్ వెనక్కి పంపాడు. స్వల్ప తేడాతో డుమినీ (12)ని కరణ్ శర్మ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఢిల్లీ 66 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ప్రవీణ్ వేసిన 16వ ఓవర్‌లో కేదార్ జాదవ్ రెండు సిక్సర్లు, బౌండ్రీ బాదడంతో ఢిల్లీ పరిస్థితి మెరుగైంది. అనంతరం భువీ బౌలింగ్‌లోనూ అతను రెండు ఫోర్లు కొట్టాడు. అయితే ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ పొదుపుగా బౌలింగ్ చేసి రైజర్స్‌ను గెలిపించాడు.