హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో లండన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫి నుంచి టీమిండియా వైదొలిగితే భారీ నష్టం ఏర్పడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీం ఆమ్లా, డేవిడ్ మిల్లర్‌లు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఈ ఇద్దరు క్రికెటర్లు పీటీఐకి ఇంటర్యూ ఇచ్చారు.
ప్రపంచంలోనే అత్యధికమంది క్రికెట్ అభిమానులున్న దేశాల్లో భారత్ ఒకటని, అలాంటి భారత్ ఈ టోర్నీలో ఆడకపోతే ఆదరణ తగ్గుందని, భారీ నష్టం తప్పదని వివరించారు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనకపోతే భారీ నష్టం తప్పదు. ప్రపంచంలో అత్యధికమంది క్రికెట్ అభిమానులున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది స్టాక్ హోల్డర్స్‌కు ఎంతమాత్రం మంచిది కాదు' అని అన్నారు.

అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 జట్లు ఆడితేనే ఆసక్తిగా ఉంటుందని మిల్లర్, ఆమ్లా అభిప్రాయపడ్డారు. అయితే భారత్ గనుక ఈ టోర్నీలో పాల్గొనకపోతే ఆ జట్టు స్ధానంలో ఎవరు ఆడతారన్న విషయం తనకు తెలియదని ఆమ్లా చెప్పాడు.
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను ఏప్రిల్ 25వ తేదీ లోపు ప్రకటించాలి. కానీ బీసీసీఐ గడువు ముగిసినా జట్టును ఎంపిక చేయలేదు. దీంతో ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు వచ్చాయి. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే విషయంలో మే 7న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని గురువారం బీసీసీఐని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆదేశించింది. 'ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని ప్రకటించేందుకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉండగా ఇప్పటి వరకు ఎందుకు జట్టును ఎంపిక చేయలేదు' అని సీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిని సీఓఏ ప్రశ్నించింది.