హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత మహిళా క్రికెటర్లకు నజరానాలు అందుతున్నాయి. ఇప్పటికే హర్మన్ ప్రీత్ కౌర్‌కి పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళా క్రికెటర్‌కి డీఎస్పీ ఉద్యోగం లభించింది.
భారత మహిళల జట్టుకి వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తోన్న సుష్మా వర్మకు హిమాచల్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో సుష్మా వర్మ ప్రదర్శనకు గర్విస్తున్నాం. తన ప్రదర్శనకు గాను ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇస్తుంది' అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం సుష్మా వర్మ రైల్వే శాఖలో పని చేస్తోంది. లార్డ్స్ వేదికగా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సుష్మా వర్మ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. 1992, నవంబరు 3న జన్మించిన సుష్మా ప్రస్తుతం వికెట్ కీపర్‌గా సేవలందిస్తోంది.
2011లో నిర్వహించిన అండర్-19 ఆల్ ఇండియా ఉమెన్స్ టోర్నీమెంట్‌లో సుష్మా నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఆదివారం పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో కౌర్ 20 ఫోర్లు 7 సిక్సుల సాయంతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హర్మన్ ప్రీత్ కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆమెకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌర్ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు.