భోపాల్: ఒకే ఒక్క తప్పుడు ట్వీట్ ఆ యువ క్రికెటర్ కెరీర్ కు బ్రేక్ వేసింది. సరైన సమాచారం తెలియకుండానే సదరు క్రికెటర్ ను నేరస్తుడిగా చూపిస్తూ ఒక నెటిజెన్ చేసిన ట్వీట్ క్షణాల వ్యవధిలో అది వైరల్ అయిపోయింది. విషయం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరడంతో ఐపీఎల్ లో అతన్ని కొనేవారు కరువయ్యారు.
మధ్యప్రదేశ్ క్రికెటర్ హర్ ప్రీత్ సింగ్ ఆవేదన ఇది. క్రికెటర్ గా కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న హర్ ప్రీత్ సింగ్ రంజీ ట్రోఫీలో 8మ్యాచ్ లు ఆడి 537పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.
అయితే హర్మీత్ సింగ్ అనే ఓ యువ క్రికెటర్ ఇటీవల ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం మీదకు తన కారు తీసుకెళ్లి ఆపాడు. దీంతో అది కాస్త వివాదమైంది. అయితే ఈ తప్పు చేసింది హర్మీత్ సింగ్ కాగా.. హర్ ప్రీత్ సింగ్ అని పేర్కొంటూ ఓ వ్యక్తి తప్పుడు ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత చాలా సైట్లు కూడా ఇదే నిజమనుకుని ఫాలో అయ్యాయి. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సరిగ్గా ఐపీల్ యాక్షన్ సమయంలో హర్ ప్రీత్ సింగ్ కు దెబ్బ పడ్డట్లయింది. నిజానికి హర్ ప్రీత్ సింగ్ ను కొనుగోలు చేయాలని పలు ఫ్రాంచైజీలు భావించినప్పటికీ అతనేదో నేరంలో ఇరుక్కున్నాడని తెలియడంతో ఆ ఆలోచన మానుకున్నామని ఒక ఫ్రాంఛైజీ అధికారి తెలిపారు.
కాగా, అసలు నేరస్తుడైన క్రికెటర్ హర్మీత్ సింగ్ అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ తరుపున కూడా ఐపీఎల్ లో ఆడాడు. ఇద్దరి పేర్లు దగ్గరగా ఉండటంతో చాలామంది హర్మీత్ ను హర్ ప్రీత్ అనుకుని పొరబడ్డారు. నెటిజెన్ తప్పుడు ట్వీట్ వల్ల హర్ ప్రీత్ సింగే రైల్వే స్టేషన్ లో అలా చేసుంటాడని భావించారు.
మొత్తం మీద ఆ ఎఫెక్ట్ హర్ ప్రీత్ సింగ్ క్రికెట్ కెరీర్ మీద పడింది. పేరుతో పాటు కెరీర్ కూడా పోయిందని హర్ ప్రీత్ ఆవేదన చెందుతున్నాడు. ప్రతీ ఒక్కరూ ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని ప్రశిస్తున్నారని వాపోతున్నాడు. ఐపీఎల్ లో ప్లేస్ దక్కనందుకు తాను బాధపడట్లేదని, ఆఖరికి గూగుల్ లో తన గురించి వెతికినా రైల్వే కేసులో అరెస్టయినట్లు వస్తోందని తెలిపాడు.