హైదరాబాద్: వరుస ఓటములతో శ్రీలంక క్రికెట్ తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. సొంతగడ్డపై టీమిండియాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో వైట్ వాష్‌కు గురవ్వడం, ఆ తర్వాత దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం జట్టులోని ఆటగాళ్లను మరింత ఒత్తిడిలోకి నెట్టింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ చేసిన వ్యాఖ్యలు శ్రీలంక క్రికెట్ బోర్డుని మరింత ఇరకాటంలో పడేశాయి. తొలి వన్డే ఓటమి అనంతరం నిక్ పోథాస్ మీడియాతో మాట్లాడుతూ జట్టుపై బయటి వ్యక్తుల పెత్తనం ఎక్కువైందని, తనకు పూర్తి స్వేచ్ఛనిస్తే జట్టుని మళ్లీ గాడిలో పెట్టగలనని స్పష్టం చేశాడు.

శ్రీలంక ప్రభుత్వంతోపాటు సెలక్టర్లు కూడా జట్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని పోథాస్ తప్పుబట్టాడు. అయితే కోచ్ మీడియాతో ఇలా బాహాటంగా వేలెత్తిచూపడాన్ని శ్రీలంక సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఉన్న సనత్ జయసూర్యతో పాటు బోర్డుకు నచ్చలేదు. దీంతో రెండో వన్డే నేపథ్యంలో కోచ్ పోథాస్ బుధవారం మీడియాతో మాట్లాడాడు.
బోర్డులో బయటి వ్యక్తుల పెత్తనం ఎక్కువ అవ్వడం వల్లే శ్రీలంక క్రికెట్ సంక్షోభానికి కారణమన్న తన గత వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చాడు. అయితే కోచ్‌పై బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే రెండో వన్డేకు ముందు తన వ్యాఖ్యలపై కోచ్ పొథాస్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నాడని లంక క్రికెట్ వర్గాలు అంటున్నాయి.