ప్రపంచ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్లేయర్లు భారీ షాట్లు ఆడేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా టీమిండియ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నాడు. కేవలం భారీ షాట్లతోనే కాకుండా.. సింగిల్, డబుల్స్‌కు అతను చాలా ప్రాముఖ్యత ఇవ్వడం గమనార్హం.
ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ అంత వేగంగా సింగిల్స్, డబుల్స్ తీసే ప్లేయర్ మరొకడు లేడు. వికెట్ల మధ్య అతను చాలా వేగంగా పరుగులు తీస్తాడు. ఇలా పరుగులు తీసేందుకే కోహ్లీ బెస్ట్ ఫిట్‌నెస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంటాడు. ఈ విషయంలో కూడా ప్రపంచంలోని బెస్ట్ ఫిట్ ప్లేయర్లలో కోహ్లీ ఒకడని చెప్పొచ్చు.

అతని ఆటతీరు చూసిన చాలా మంది నిపుణులు కోహ్లీ డెడికేషన్‌కు జోహార్లు చెప్తుంటారు. కొత్త కుర్రాళ్లు కూడా కోహ్లీలా వికెట్ల మధ్య పరిగెత్తడం నేర్చుకోవాలని చెప్తుంటారు. మరి ఇలాంటి కోహ్లీ వికెట్ల మధ్య ఇప్పటి వరకు ఎంత దూరం పరిగెత్తి ఉంటాడు? ఇదే అనుమానం చాలా మంది ఫ్యాన్స్‌కు వచ్చింది.
దీనికి ప్రముఖ క్రికెట్ స్టాట్స్ వెబ్‌సైట్ సమాధానం చెప్పింది. ఇలా సింగిల్స్, డబుల్స్ తీయడం కోసమే కోహ్లీ 500 కిలోమీటర్లపైగా దూరం ప్రయాణించాడట. వీటిలో తను తీసిన పరుగుల కోసం 277 కిలోమీటర్లు ప్రయాణించగా.. తోటి ప్లేయర్లు మొదలు పెట్టిన పరుగుల కోసం 233 కిలోమీటర్లు పరిగెత్తాడట కోహ్లీ.
ఓవరాల్‌గా కోహ్లీ ఇలా 510 కిలోమీటర్లపైగా దూరం పరిగెత్తినట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఇప్పటికీ కుర్రాళ్ల కన్నా బెస్ట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తుండటం గమనార్హం. వచ్చే ఆసియా కప్, వరల్డ్ కప్ నెగ్గాలంటే టీమిండియాకు అతను చాలా కీలకం. మరి అతను ఎలా రాణిస్తాడో చూడాలి.