ముంబై : గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఇదొక ఆసక్తికర విషయం. 24 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్స్ అందుకున్న సచిన్.. క్రీజులో వికెట్ల మధ్య పరిగెత్తిన దూరమెంతో తెలుసా? 353కి.మీ. అవును.. అంత సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో దాదాపు 353కి.మీ వికెట్ల మధ్యన పరిగెత్తాడట సచిన్.
కెరీర్ లో మొత్తంలో 31,055 పరుగులు సాధించిన సచిన్ వికెట్ల మధ్య 186 మైల్స్ పరిగెత్తాడు. ఇది 353కి.మీలకు 3,28,138 యార్డ్స్ కు సమానం. కెరీర్ మొత్తంలో 3675 ఫోర్లతో పాటు 240 సిక్సర్లు సాధించాడు సచిన్. కెరీర్ మొత్తంలో చేసిన పరుగుల్లో 16,140 పరుగులు బౌండరీ ద్వారానే రావడం గమనార్హం.

న్యూఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ తన ఫిట్ నెస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించగా.. ఇప్పుడీ ఆసక్తికర వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక కార్యక్రమంలో మాట్లాడిన సచిన్.. తాను ఫిట్ గా ఉండడానికి రన్నింగ్ కీలకంగా మారిందని చెప్పాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడంలో తన టెక్నిక్ గురించి చెప్పాడు సచిన్. వేగంగా పరిగెత్తే క్రమంలో క్రీజుకు సమీపించే కొద్దీ వేగాన్ని తగ్గించడం.. మళ్లీ పెంచుకుంటూ పోవడం.. లాంటి టెక్నిక్ ను సమయస్ఫూర్తితో ఉపయోగించేవాడినని చెప్పుకొచ్చాడు.
గతంలో జరిగిన ఓ సంఘటన గురించి ప్రస్తావిస్తూ.. ఒకానొక సమయంలో క్రీజులో ఉండగా తన పక్కటెముకలకు బంతి బలంగా తాకిందని చెప్పాడు సచిన్. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిందని, కానీ ఆ బాధను మొహంలో కనిపించకుండా జాగ్రత్తపడుతూ బ్యాటింగ్ చేసేవాడినని తెలిపాడు సచిన్. ప్రస్తుతం టీమ్ ఇండియా టాప్ టీమ్స్ లో ఒకటిగా ఉందని, ఆటగాళ్లంతా ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాలని ఈసందర్బంగా సచిన్ సూచించాడు.