
కపిల్ దేవ్ సలహా:
డబ్ల్యూవీ రామన్ యూట్యూబ్ ఛానల్ 'ఇన్సైడ్ అవుట్'లో తాజాగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... 'క్రికెటర్‌గా నా కెరీర్ ముగిసిన అనంతరం ఏం చేయాలో మొదటగా అసలు పాలుపోలేదు. నేను ఎంచుకోవడానికి కొన్ని మార్గాలు మాత్రమే నాముందు ఉన్నాయి. అప్పుడే కపిల్ దేవ్ ఒక మంచి విషయం చెప్పాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కొన్నేళ్లు ఏదో ఒక పనిచేస్తూ నీకు ఏం నచ్చుతుందో దాని మీద ధ్యాస పెట్టమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

కోచింగ్ సరైందని భావించి:
'నా కెరీర్ ముగింపు దశకు వచ్చేసరికే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్, కోచ్ బాధ్యతల్లో కొనసాగుతున్నా. నా అదృష్టవశాత్తూ అలా కోచింగ్ కెరీర్ కొనసాగింది. నాకు కోచింగ్ సరైందని భావించి ఈ వృత్తిలోకి వచ్చా. ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇండియా-ఎ, అండర్ -19 కోచింగ్‌తో సంతృప్తికరంగా ఉంది. సహజంగా నేను టెస్టు క్రికెటర్‌ని, నాకు కోచింగ్ కూడా టెస్టు క్రికెటర్‌లాగే సాగింది. ఒకవేళ నా కెరీర్ సాఫీగా సాగకపోయుంటే ఎంబీఏ చేసేవాడి' అని ద్రవిడ్ తెలిపాడు.

కుటుంబంతో గడపాలనే:
రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిని తిరస్కరించిన విషయం తెలిసిందే. కుటుంబంతో గడపాలనే ఏకైక కారణంతోనే ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిని తిరస్కరించాడని సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపాడు. రాహుల్ ద్రవిడే మాకు సరైనవాడనిపించింది. కానీ అతను మాత్రం ఈ పదవిని చెప్పట్టేందుకు సుముఖంగా లేనని చెప్పాడు. 'నాకు ఎదుగుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్నాళ్లు భారత జట్టు తరఫున ఆడి దేశాలు పట్టుకొని తిరిగా. దీని వల్ల వారికి సమయం కేటాయించలేకపోయా. కనీసం ఇప్పుడైనా ఇంటిపట్టునే ఉంటూ వారికి సమయం కేటాయించాలనుకుంటున్నా'అని ద్రవిడ్ మాతో అన్నాడు. అతని అభ్యర్థన కూడా సరైందే అనిపించింది. దీంతో మేం కూడా అతన్ని బలవంతం చేయలేదు' అని రాయ్ వెల్లడించాడు.

క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ స్థానం:
భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా ద్రవిడ్ ఎందరో ప్రతిభావంతమైన ఆటగాళ్లను భారత జట్టుకు అందించాడు. ప్రస్తుత భారత జట్టులో ఆడుతున్న పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లు ద్రవిడ్ దిశానిర్దేశంలోనే మెరుగైన ఆటగాళ్లు. పృథ్వీషా నేతృత్వంలోని భారత అండర్-19 జట్టు ప్రపంచకప్ గెలిచిందన్నా.. ఈ ఏడాది ప్రియామ్ గార్గ్ సేన ఫైనల్‌కు చేరిందన్నా అది ద్రవిడ్ కోచింగ్ సామర్థ్యమే. ఇప్పుడు ఎన్‌సీఏ అకాడమీ డైరక్టర్‌గా సీనియర్ క్రికెటర్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇక ద్రవిడ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారత్ తరఫున 164 టెస్టుల్లో 13,288.. 344 వన్డేల్లో 10,899.. ఒక టీ20లో 31 పరుగులు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు.


Click it and Unblock the Notifications












