
రాంచీ: 437 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు. శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. చాలా నెలల తర్వాత మహీని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తన న్యూ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని, గతం కంటే భిన్నంగా కనిపించాడు. ఆయన ఫిట్‌నెస్, హెయిర్ స్టైల్ సరికొత్తగా ఉన్నాయి.
శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోనీ మాట్లాడాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో (ధోనీ చేతిలో మైక్ ఉన్న ఫొటో)ని ధోనీ భార్య సాక్షి సింగ్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేకాదు ఆ ఫొటోకి ఓ అద్భుత కాప్షన్ ఇచ్చారు. 'మహీ ఎంత అందంగా ఉన్నాడో' అని సాక్షి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. మహీ అభిమానులు లైకులు, షేర్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
సీఎస్‌కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తరువాత లాక్‌డౌన్‌లో క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు అని ఎంఎస్ ధోనీని భరత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అడిగాడు. 'లాక్‌డౌన్‌లో స్వేచ్చగా, ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోనే గడిపాను. తనతోనే ఉండడంతో జీవా సంతోషించింది' అని మహీ చెప్పాడు. లాక్‌డౌన్ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నందుకు మిగతా జట్టు సభ్యులను కూడా అభినందించాడు. కాగా జీవా, సాక్షి రాంచీలోనే ఉన్నారు.
మైదానంలోకి వచ్చీ రావడంతోనే ఎంఎస్ ధోనీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అబుదాబి వేదికగా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో 100 మ్యాచ్‌లు గెలిపించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ 161 మ్యాచ్‌ల్లో ధోనీ సారథ్యం వహించగా.. అందులో 100 మ్యాచుల్లో ఆయన జట్టు విజేతగా నిలిచింది. అయితే మహీకి ఈ మ్యాచ్‌లో పెద్దగా బ్యాట్‌తో పనిచెప్పే అవసరం రాలేదు. 22న షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచులో మహీ నుంచి ఓ భారీ ఇన్సింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు.