South Africa: దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి జట్టుగా ఆవిర్భవించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఇదే తొలిసారి.ఇక రెండో స్థానం కోసం ప్రస్తుతానికి మూడు జట్లు పోటీ పడుతోన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లకు ఆ అవకాశం ఉంది.
సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది దక్షిణాఫ్రికా. రెండు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. గెలవడానికి అవసరమైన 147 పరుగులను అతి కష్టం మీద ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది దక్షిణాఫ్రికా. 2025 జూన్ 11వ తేదీన లండన్‌లోని లార్డ్స్ స్టేడియం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోయే జట్టు ఏది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ రేసులో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆస్ట్రేలయా, మూడో స్థానంలో భారత్, ఫోర్త్ ప్లేస్‌లో న్యూజిలాండ్ ఉన్నాయి. శ్రీలంకకూ ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. ఒక మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి ఒక్కో జట్టుకు. మ్యాచ్ టై అయితే- 6, డ్రా అయితే- 4 పాయింట్లు అందుతాయి.
పాయింట్ల పర్సంటేజీ ఆధారంగా చేసుకుని ర్యాంకులను నిర్ధారిస్తుంది ఐసీసీ. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. 11 మ్యాచ్‌లల్లో ఏడు విజయాలను అందుకుంది దక్షిణాఫ్రికా. ఒకటి డ్రా అయింది. మొత్తం 88 పాయింట్లు ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఈ జట్టుకు ఉన్న పర్సంటేజీ 66.670.
ఇప్పటివరకు 17 మ్యాచ్‌లను ఆడింది భారత్. తొమ్మిది విజయాలను అందుకుంది. ఆరింట్లో ఓడింది. రెండు డ్రా అయ్యాయి. మొత్తం ఉన్న పాయింట్ల సంఖ్య 106. 55.880 పర్సంటేజీని నమోదు చేసింది. ఆస్ట్రేలియాదీ దాదాపుగా ఇదే స్థితి. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లల్లో నాలుగింట్లో ఓడింది. రెండు డ్రా అయ్యాయి. 106 పాయింట్లతో 58.890 పర్సంటేజీని రికార్డు చేసింది ఆసీస్.
ఈ పాయింట్లు గానీ, పర్సంటేజీ గానీ పెరగాలంటే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఈ రెండు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ గనక డ్రా అయితే సిడ్నీలో జనవరి 3వ తేదీన ఆరంభం అయ్యే చివరిదైన అయిదో మ్యాచ్‌లో గెలిచి తీరక తప్పదు టీమిండియాకు.
అదే సమయంలో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవాల్సి ఉంటుంది. అలా జరిగితేనే పాయింట్లు, పర్సంటేజీల సంఖ్యలో భారత్ కంటే వెనుకంజలో ఉంటుంది. ఒక్కటి గెలిచినా పాయింట్లు, పర్సంటేజీ భారత్ కంటే మెరుగుపడుతుంది. ఫైనల్స్ చేరే అవకాశాన్ని అందుకుంటుంది ఆసీస్.