
హైదరాబాద్: సఫారీలు కంగారూల సిరీస్‌లో మొన్నటి వరకు వివాదాలు నడిచినా.. తాజాగా సరదా సన్నివేశాలు సైతం పేలుతున్నాయి. తాజాగా జరిగిన ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన ఈ సంఘటన నవ్వు తెప్పిస్తోంది. బ్యాట్ టచ్ అయి నిదానంగా వస్తోన్న బంతిని సైతం పట్టుకోలేకపోవడంతో అతనిపై వ్యంగ్యంగా సెటైర్లు పడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు సైతం పేలుతున్నాయి.
ఈ ఘటనకు బాల్ ట్యాంపరింగ్‌తో కూడా లింక్ పెడుతూ జోకులు వేస్తున్నారు నెటిజన్లు. చివరి టెస్ట్ రెండో రోజు ఆసీస్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ క్రీజులో ఉండగా... సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. మార్ష్ బాల్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. కానీ, మిస్సయ్యాడు. వికెట్ల వెనకున్న డీకాక్ బాల్‌ను పట్టుకొని స్టంపింగ్ చేయలేకపోయాడు.
డీకాక్ స్టంపింగ్ మిస్ చేయడంతో మార్ష్‌కు లైఫ్ వచ్చింది. అంత స్లోగా వస్తున్న బాల్‌ను ఎందుకు పట్టుకోలేకపోయాడోనని మిగిలిన ఆటగాళ్లు షాకయ్యారు. స్టేడియంలో ఉన్నవాళ్లంతా నోళ్లువెల్లబెట్టారు. కాసేపటి తర్వాత గానీ, తెలియలేదు. బాల్ వదిలేశాక డీకాక్ తన భుజాన్ని దులుపుకున్నాడు. పాపం అతడి భుజంపై ఓ తేనటీగ వాలి కుట్టిందట.
అందుకే బాల్‌ను వదిలేశాడని. ఇప్పుడీ వీడియోపై జోకులు పేలుతున్నాయి. ఐసీసీ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కొంతమంది సెటైర్లు వేశారు. మరికొందరైతే ఆ ఈగ డీకాక్‌ను ఏప్రిల్ ఫూల్ చేసిందని పంచ్ వేశారు. తేనటీగపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని కూడా జోక్ చేశారు.