ఆసీస్ గడ్డపై అనిల్ కుంబ్లే జోస్యం నిజమైన వేళ!

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది.
1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. ఈ సిరిస్‌కు ముందు పలువురు మాజీ క్రికెటర్లు ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు.

భారత్ 2-1 తేడా గెలుస్తుందని కుంబ్లే జోస్యం
టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం భారత్ 2-1 తేడా గెలుస్తుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. సిరీస్ ప్రారంభానికి ముందే ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కుంబ్లే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విషయంలో చివరకు కుంబ్లే అంచనానే నిజమైంది.

డ్రాగా ముగిసే అవకాశం ఉందా?
"ఏ మ్యాచ్ అయినా డ్రాగా ముగిసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కూడా కుంబ్లే సరిగ్గా బదులిచ్చారు. వర్షం కారణంగా ఒక టెస్టు డ్రా కావచ్చు" అంటూ కుంబ్లే అంచనా వేశారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సిరిస్‌లో చివరిదైన సిడ్నీ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో ఈ సిరిస్‌ను 2-1 తేడాతో కోహ్లీసేన సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

వీవీఎస్ లక్ష్మణ్ 3-1 తేడాతో
మరోవైపు వీవీఎస్ లక్ష్మణ్ 3-1 తేడాతో భారత్ గెలుస్తుందని చెప్పగా... చివరి టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించడంతో లక్ష్మణ్ అంచనా తప్పింది. ఇక, ఆతిథ్య జట్టు తరుపున ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ 2-1 ఫలితాన్ని అంచనా వేశారు. ఆసీస్ జట్టు 2-1 తేడాతో గెలుస్తారని పాంటింగ్ చెప్పగా అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది.

విరాట్ కోహ్లీతో పోలిస్తే
దీంతో పాటు ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలిస్తే ఉస్మాన్ ఖవాజా ఎక్కువ పరుగులు సాధిస్తాడని పాంటింగ్ అంచనా వేశాడు. అయితే, ఖవాజా 198 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 282 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌లో పుజారా స్లో బ్యాటింగ్ భారత్‌కు ప్రతికూలం అవుతుందని పాంటింగ్ హెచ్చరించాడు. పుజారా కారణంగానే టీమిండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం.

ఇక మిగిలింది దక్షిణాఫ్రికాపైనే!
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకున్న టీమిండియా ఇక దక్షిణాఫ్రికాలో టెస్టు సిరిస్ నెగ్లాల్సి ఉంది. 1992 నుంచి ఈ గడ్డపై పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటివరకు టెస్టుసిరిస్ నెగ్గలేదు. గతేడాది జనవరిలో ముగిసిన పర్యటనలో టెస్టు సిరీస్ విజయం సాధించేందుకు దగ్గరగా వచ్చినప్పటికీ టీమిండియా బ్యాట్స్‌మన్ విఫలం కాడవంతో ఆ అవకాశాన్ని పొగొట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications