
హైదరాబాద్: విశాఖపట్నం అచ్చం శ్రీలంకను తలపిస్తుందని లంక వన్డే జట్టు కెప్టెన్ తిసారా పెరీరా అన్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డే భారత్-శ్రీలంక జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో తిసారా పెరీరా మీడియాతో మాట్లాడాడు.
'విశాఖపట్నం అచ్చం శ్రీలంకను తలపిస్తుంది. ఇక్కడి వాతావరణం, పరిస్థితులు అక్కడిలాగే ఉంటాయి. మొహాలి, ధర్మశాల పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మేం బాగా సన్నద్ధమయ్యాం. స్వదేశంలా అనిపిస్తున్న ఇక్కడ మేం ప్రత్యేకంగా ఏమైనా చేయగలం అనిపిస్తుంది. మూడో వన్డే కోసం ఇప్పటికే బాగా ప్రాక్టీస్ చేశాం' అని పెరీరా అన్నాడు.
ఈ మ్యాచ్‌ను సాధారణ మ్యాచ్‌లాగే చూస్తున్నాం. సిరీస్ చేజారిపోతుందా? అని ఆలోచించడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అయిన భారత్‌లోనే ప్రస్తుతానికి కొంత ఒత్తిడిలో ఉండొచ్చు. పిచ్‌ను పరిశీలించిన తర్వాతే ఆదివారం తుది జట్టును ఎంపిక చేస్తాం. మా బౌలింగ్ నిరాశ పరుస్తోంది' అని తెలిపాడు.
'క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలాంటివి సహజమే. మళ్లీ మేం పుంజుకుంటాం. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ను అడ్డుకోవడానికి కొన్ని ప్రణాళికలు రచించాం. మూడో వన్డేకి మానసికంగా సిద్ధమయ్యాం. ధర్మశాల తరహాలో తొలి ఓవర్లలోనే వికెట్లు తీస్తే మాకు అవకాశాలు ఉంటాయి' అని పెరీరా అన్నాడు.
'పిచ్ విషయానికి వస్తే డ్రైగా ఉంది. గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఎండ రావడంతో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది' అని భావిస్తున్నానని పెరీరా అన్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.