న్యూఢిల్లీ: సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి వెస్టిండిస్ టీ20 కెప్టెన్ డారెన్ సామీ తన పేరు పెట్టడాన్ని స్వాగతించాడు. తనకి దక్కిన అరుదైన గౌరవంగా దీనిని భావిస్తానని చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే... వెస్టిండిస్‌కు రెండు సార్లు టీ20 వరల్డ్ కప్‌ను అందించిన కెప్టెన్ డారెన్ సామీకి స్వదేశంలో అరుదైన గౌరవం లభించింది.
సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి డారెన్ సామీ పేరు పెట్టారు. ఈ స్టేడియం పేరును డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా మారుస్తూ సెయింట్ లూసియా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న డారెన్ సామీకి హివనోర్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
సెయింట్ లూసియా క్రికెటర్లు సామీ, జాన్సన్ చార్లెస్‌లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సెయింట్ లూసియాలోని స్టేడియం పేరు మార్పు విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు స్టేడియంలోని ఓ స్టాండ్‌కు చార్లెస్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు.

స్వదేశంలో తనకు లభించిన ఘన స్వాగతంపై సామీ ఎంతగానో సంతోషించాడు. 'నాకు అరుదైన గౌరవం దక్కింది. అందరికీ ధన్యవాదాలు. సెయింట్ లూసియన్స్ ఎంతో ప్రేమిస్తారు. విమానాశ్రయంలో ప్రేమాభిమానాలు, గౌరవం దక్కాయి. ఓ మై గాడ్.. థ్యాంక్యూ వెరీ మచ్' అని స్యామీ ఉద్వేగంతో అన్నాడు.
ఇదిలా ఉంటే కరేబియన్ దీవులన్నీ కలిసి వెస్టిండిస్ జట్టు పేరిట అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాయి. కాగా, టీ20 వరల్డ్ కప్ సాధించిన వెస్టిండిస్ జట్టులో కెప్టెన్ సామీ, జాన్సన్ చార్లెస్ సెయింట్ లూసియాకు చెందినవారు. సామీ కెప్టెన్సీలో విండీస్ రెండుసార్లు టీ20 వరల్డ్ కప్‌ను సాధించింది.