
హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ తాను విరాట్ కోహ్లీకి అభిమానినని చెప్పుకున్నాడు. ఆగస్ట్ 31వ తేదీన ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు నిజాకత్ ఖాన్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్ కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది. 2019 నుంచి ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ సెంచరీ కొట్టలేకపోయాడు. అయితే ఆదివారం పాకిస్తాన్‌పై ఓపికగా ఆడాడు. 34బంతుల్లో 35పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే తన ఇన్నింగ్స్‌లో కాస్త తడబడ్డాడు. ఇకపోతే నిజాకత్ ఖాన్ న్యూస్ 24తో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై కోహ్లీ బాగా ఆడాడని పేర్కొన్నాడు. కోహ్లీకి తాను వీరాభిమానని చెప్పుకొచ్చాడు.
'నేను విరాట్ కోహ్లికి పెద్ద అభిమానిని, అతను మొన్న పాకిస్తాన్‌పై మంచిగా ఆడాడు. అతను ఫామ్‌లోకి రావాలని, రన్స్ దండిగా చేయాలని నేను నిజంగా కోరుకుంటున్నాను' అని నిజాకత్ ఖాన్ చెప్పాడు. ఆసియా కప్‌లో హాంకాంగ్ వర్సెస్ భారత్ మధ్య గత ఆసియా కప్‌లో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇకపోతే టీ20 ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు అని.. తమ జట్టు ఇండియాపై గెలుస్తామనే నమ్మకంతో ఉందని ఖాన్ చెప్పాడు.
'మేము పోయినసారి 2018 ఆసియా కప్‌లో భారత్‌తో తలపడినప్పుడు కేవలం 20పరుగుల తేడాతో ఓడిపోయాం. టీ20 గేమ్‌లో ఏదైనా జరగవచ్చు. ఒక్క బౌలర్ మంచి స్పెల్ ఇచ్చినా.. ఒక్క బ్యాటర్ రఫ్ఫాడించినా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అప్పుడు అవతల ఎంత పెద్ద జట్టు ఉన్నా ఏం చేయలేరు. మేం అసోసియేట్ జట్టు అయినప్పటికీ.. మాలో సత్తా ఉంది. చాలా సందర్భాల్లో అగ్ర జట్లు చిన్న జట్లతో ఎలా ఓడిపోయాయో మేము గతంలో చూశాం. మేం కూడా కొన్ని జట్లను ఓడించాం. మేము పాజిటివ్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాము. మేము మా ప్రాసెస్‌ను తుచా తప్పకుండా అమలు చేస్తాం. మేం ఓడే ప్రసక్తే లేకుండా పోరాడుతాం' అని నిజాకత్ ఖాన్ అన్నాడు.