హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్రూప్-సీలో భాగంగా పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా వచ్చిన భరత్ చిప్లి (53; 16 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (31; 8 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. ఉతప్ప తాను ఎదుర్కొన్న ఎనిమిది బంతుల్లో ఆరింటిని బౌండరీకి తరలించాడు. భరత్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. అర్ధశతకం సాధించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు రాణించలేకపోయారు. కేదార్ జాదవ్ మూడు బంతుల్లో 8 పరుగులు చేశాడు. మనోజ్ తివారీ 7 బంతుల్లో అజేయంగా 17 పరుగులే చేశాడు. 2 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. టీమిండియాకు రాబిన్ ఉతప్ప కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఆరు బంతులు మిగిలుండానే 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు ముహమ్మద్ (40 నాటౌట్; 12 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అసిఫ్ అలీ (55 రిటైర్డ్ హట్; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఊచకోతకు దిగారు. కెప్టెన్ ఫహీమ్ (22 నాటౌట్; 5 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) సత్తాచాటాడు. భారత బౌలర్లలో రెండు ఓవర్లు వేసిన షాదాబ్ నదీమ్ 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క ఓవర్ వేసిన కేదార్ జాదవ్ 23, స్టువర్ట్ బిన్ని 21 పరుగులు ఇచ్చారు.
ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-సీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు యూఏఈ ఉంది. యూఏఈతో రేపు భారత్ తలపడనుంది. కాగా, ఈ టోర్నీలో ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. ఓ మ్యాచ్‌లో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది.