న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై హాకీ ఇండియా చీఫ్ నరీందర్ బత్రా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు సరిహద్దుల్లో ప్రత్యర్థితో పోరాడుతూ భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే పాక్‌తో క్రికెట్ సంబంధాల కోసం బిసిసిఐ పాకులాడడం ఎంతవరకు సమర్థనీయమని ఆయన నిలదీశారు.
ఇరుజట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ను వచ్చేనెలలో శ్రీలంక వేదికగా ఆడాలని ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు సిరీస్ నిర్వహణకు తమ దేశ ప్రధాని నుంచి ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డుకు గ్రీన్‌సిగ్నల్ లభించగా, భారత ప్రభుత్వ అనుమతి కోసం బిసిసిఐ వేచిచూస్తోంది.

ఈ నేపథ్యంలో బత్రా మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేదాకా ఆ దేశంతో క్రికెట్ ఆడేదే లేదంటూ ఈ మధ్యే బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారనీ, ఇంతలోనే మాటమార్చుతూ ఆ దేశంతో సిరీస్‌కు సిద్ధపడుతున్న బిసిసిఐ వైఖరిని బత్రా తప్పుబట్టారు. బిసిసిఐదంతా కాసుల కక్కుర్తేనని తీవ్రంగా ఆరోపించారు.
హాకీ ఇండియాకు బిసిసిఐకన్నా ఎక్కువ డబ్బు అవసరముంందని అన్నారు. కానీ, పాక్ ఉగ్రవాద వైఖరి కారణంగా 2012లో ఆ దేశ హాకీ జట్టుతో సిరీస్ కోసం మేం కుదుర్చుకున్న ఒప్పందాన్ని(ఎమ్‌వోయూ) ఇప్పటికీ పక్కనపెట్టామని గుర్తు చేశారు.
'పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ గనుక ఆడితే రూ. 5 కోట్లు ఆదాయం మాకు సమకూరుతుంది. కానీ, మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి, సిరీస్‌కు నో చెప్పాం. బిసిసిఐ మాత్రం ఎమ్‌వోయూను గౌరవించడం కోసమే ఆ దేశంతో క్రికెట్ అంటూ కొత్తరాగం అందుకుంది' అని బాత్రా బిసిసిఐ వైఖరిపై ధ్వజమెత్తారు.