
టీమిండియా టాపార్డర్ హిట్
వన్డే వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో భారత టాపార్డర్ మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక కోహ్లీ తొలి ఏడాదిని సెంచరీతో మొదలు పెట్టాడు. టాపార్డర్ సూపర్‌గా రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది.
వన్డే ఫార్మాట్లో తొలిసారి కలిసి ఓపెనింగ్ చేసిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ జోడీ తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కోహ్లీ 118 పరుగులతో రాణించాడు. దీంతో ఆ జట్టు 373 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. కోహ్లీకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది.

శ్రీలంక బౌలింగ్ ఫ్లాప్
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న శ్రీలంకకు అది కలిసిరాలేదు. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై లంక బౌలర్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. తొలి పవర్‌ప్లేలో కాసున్ రజిత్, దిల్షాన్ మధుశంక పిచ్ నుంచి ఏమాత్రం మూవ్‌మెంట్ సంపాదించలేకపోయారు. ఇక ఆ జట్టు ఏస్ స్పిన్నర్ వానిందు హసరంగ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు.
మహీష్ తీక్షణ స్థానంలో జట్టులోకి వచ్చిన దినుత్ వెల్లలెగె కూడా పెద్దగా రాణించలేదు. అతను వేసిన 8 ఓవర్లలోనే 65 పరుగులు ఇచ్చాడు. ఇక శ్రీలంక తరఫున మూడు వికెట్లు తీసుకున్న రజిత్.. తన పది ఓవర్లలో ఏకంగా 88 పరుగలు ఇవ్వడం గమనార్హం. పిచ్ బౌలర్లకు సహకరించకపోయినా.. లంక బౌలర్లు ఎక్కువగా లూజ్ బాల్స్ వేశారు. దీన్ని భారత బ్యాటర్లు చక్కగా యూజ్ చేసుకున్నారు.

కెప్టెన్ దాసున్ షనక హిట్
శ్రీలంకను గెలిపించేందుకు కెప్టెన్ దాసున్ షనక ఒంటరి పోరాటం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో జట్టు స్కోరు 138/4గా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతను.. నిస్సంక (72)తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. అయితే నిస్సంక అవుటైన తర్వాత అతనికి సహకారం అందించే వాళ్లే కరువయ్యారు. అయినా సరే పట్టుదల ప్రదర్శించిన షనక.. వన్డేల్లో తన తొలి శతకం సాధించాడు.
చివర్లో 9వ వికెట్‌కు రజితతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీనిలో రజిత్ చేసిన పరుగులు కేవలం 9 మాత్రమే కావడం గమనార్హం. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగే షనక.. ఇదే ఫామ్ కొనసాగిస్తే కచ్చితంగా అతను భారత్‌కు పెద్ద సమస్యగా మారడం ఖాయం.

అక్షర్ అట్టర్ ఫ్లాప్
ఇటీవలి కాలంలో టీమిండియాలో మంచి పరిణితి సాధించిన ఆటగాడు అక్షర్ పటేల్. ఈ వన్డేలో హార్దిక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. తన ఫామ్ కొనసాగిస్తూ జట్టుకు భారీ ఫినిష్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ 9 బంతుల్లో 9 పరుగులు చేసిన తర్వాత ఒక చెత్త షాట్ ఆడిన అక్షర్ పెవిలియన్ చేరాడు.
బంతిని ఏమాత్రం అంచనా వేయకుండా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. ఇక బౌలింగ్‌లో కూడా అక్షర్ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా మ్యాచ్ ముగించిన బౌలర్ అక్షర్ మాత్రమే. మొత్తం పది ఓవర్లలో వికెట్లేమీ లేకుండా 58 పరుగులు ఇచ్చాడీ ఎడం చేతి వాటం స్పిన్నర్. వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాడిని కాదని జట్టులోకి తీసుకున్న అక్షర్ ఇలా విఫలమవడంతో సుందర్‌కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications












