టీ20 క్రికెట్‌లో యూఎస్ఏ సంచలనం సృష్టించింది. పూర్తి సభ్య దేశంపై తొలి విజయాన్ని అందుకుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ అరుదైన ఘనత సాధించింది. హౌస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాపై అమెరికా అయిదు వికెట్ల తేడాతో నెగ్గింది. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ ఈ గెలుపు యూఎస్‌ఏ జట్టులో రెట్టింపు ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తౌహిద్ (58; 47 బంతుల్లో, 4x4, 2x6) టాప్ స్కోరర్. బంగ్లాను ఆదిలోనే యూఎస్‌ఏ దెబ్బ కొట్టింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు లిటన్ దాస్ (14; 15 బంతుల్లో, 1x4, 1x6), సౌమ్య సర్కార్ (20; 13 బంతుల్లో, 3x4)ను పెవిలియన్‌కు చేర్చింది.

కాసేపటికే కెప్టెన్ షాంటో (3; 11 బంతుల్లో), షకిబ్ అల్ హసన్ (6; 12 బంతుల్లో)ను కూడా ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా (31; 22 బంతుల్లో, 2x4, 1x6)తో కలిసి తౌహిద్ ఇన్నింగ్స్‌కు చక్కదిద్దాడు. కానీ బంగ్లా బ్యాటర్లు నిదానంగా ఆడటంతో 153 పరుగులకే పరిమితమైంది. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో యునైటెడ్ స్టేట్స్ 19.3 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే యూఎస్‌ఏ ఇన్నింగ్స్ ఛేజింగ్ సాఫీగా సాగలేదు. 94 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. మోనన్క్ పటేల్ (12; 10 బంతుల్లో, 1x6), ఆండ్రైస్ గౌస్ (23; 18 బంతుల్లో, 4x4), స్టీవెన్ టేలర్ (28; 29 బంతుల్లో, 1x4, 1x6), ఆరోన్ జేమ్స్ (4; 12 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. కానీ ఆండర్సన్ (34*; 25 బంతుల్లో, 2x6), హర్మీత్ సింగ్ (33*; 13 బంతుల్లో, 2x4, 3x6) బంగ్లాకు మరో అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.