ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో గెలిచింది. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను నెగ్గింది. కంగారూల గడ్డపై పాకిస్థాన్ వన్డే సిరీస్ గెలవడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో చివరిసారిగా 2002లో పాకిస్థాన్ వన్డే సిరీస్ నెగ్గింది.
ఆ తర్వాత మళ్లీ విజయాన్ని అందుకోవడానికి రెండు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. ఇటీవల సొంతగడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సిరీస్ గెలిచిన పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అయితే ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం పరిపూర్ణంగా భావించలేనిది. భారత్‌తో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు దూరమయ్యారు.

తొలి రెండు వన్డేలకు ఆస్ట్రేలియాను నడిపించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆఖరి మ్యాచ్‌కు జోష్ ఇంగ్లిష్‌కు సారథి బాధ్యతలు అందించాడు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి విధ్వంసకర ప్లేయర్లు తొలి రెండు వన్డేలకు అందుబాటులో లేరు. ఇక ఆఖరి మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ వంటి ప్లేయర్లు కూడా దూరమయ్యారు.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. అబాట్ (30; 41 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. అబాట్‌తో పాటు మాథ్యూ షార్ట్ (22; 30 బంతుల్లో, 1 ఫోర్) మినహా ఎవరూ 20 పరుగుల మార్క్‌ను దాటలేదు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరో మూడు వికెట్లు, హారిష్ రవూఫ్ రెండు, హస్నైన్ ఒక్క వికెట్ తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సయిమ్ అయుబ్ (42; 52 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), అబ్దుల్లా షఫికి (37; 53 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), మహ్మద్ రిజ్వాన్ (30 నాటౌట్; 27 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), బాబర్ అజామ్ (28 నాటౌట్; 30 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేశారు. లాన్స్ మోరిస్ రెండు వికెట్లు తీశాడు.