క్రికెట్ లో చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ ఇంగ్లాండ్ జట్టును.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌ను 2024 టీ20 వరల్డ్ కప్ లో అమెరికా పాకిస్తాన్ ను ఓడించాయి. ఇదే తరహాలో నమీబియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విండ్‌హోక్‌లో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. పసికూనగా భావించే నమీబియా బలమైన జట్టు దక్షిణాఫ్రికాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఘనతను అందుకుంది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో నమీబియా చివరి బంతికి విజయాన్ని అందుకుని పెద్ద జట్టుకు షాకిచ్చింది.
చివరి బంతికి ఉత్కంఠ విజయం
దక్షిణాఫ్రికా కెప్టెన్ డొనోవన్ ఫెరీరా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా వారి నిర్ణయం తప్పని నిరూపించబడింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి జట్టులో జేసన్ స్మిత్ 31 పరుగులు చేయగా.. ఏ ఇతర బ్యాటర్ 30 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్‌మ్యాన్ 3 వికెట్లు, మాక్స్ హీంగో 2 వికెట్లు తీసి సత్తా చాటారు.

135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన నమీబియా కూడా ప్రారంభంలో తడబడింది. 51 పరుగులకే 3 వికెట్లు, 84 పరుగులకే సగం జట్టు(5 వికెట్లు) కోల్పోయినా.. నమీబియా ఆటగాళ్లు పట్టు వదల్లేదు. చివరి ఓవర్లో నమీబియా విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. జేన్ గ్రీన్ పోరాటం అద్భుతంగా సాగింది. ఓవర్‌ను సిక్సర్‌తో ప్రారంభించిన జేన్ గ్రీన్.. ఆ తర్వాత రెండు బంతుల్లో 3 పరుగులు చేశాడు. ఒక బంతి డాట్ అవ్వగా.. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి వచ్చింది. ఈ సమయంలో గ్రీన్ ఫోర్ కొట్టి నమీబియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. నమీబియా తరఫున గ్రీన్ అత్యధికంగా 30 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాండ్రే బర్గర్, ఆండిలే సిమిలెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
నమీబియా చారిత్రక ఘనత
అసోసియేట్ దేశమైన నమీబియా.. ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాన్ని ఓడించడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లపై గెలిచింది. అసోసియేట్ దేశం చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడం చరిత్రలో ఇది కేవలం రెండోసారే. టీ20లలో నమీబియా చివరి బంతికి గెలవడం ఇది రెండోసారి. ఈ విజయం నమీబియా క్రికెట్‌కు ఓ మైలురాయిగా నిలిచింది.