Afghanistan vs Hong Kong: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో పసికూన హాంకాంగ్ జట్టు ఘోర పరాజయం పాలైంది. ఈ ఘోర ఓటమిపై హాంకాంగ్ కెప్టెన్ యాసిమా ముర్తాజా స్పందించాడు. ఆసియా కప్‌లో ఆడటం ఒక కల నిజమైనట్లు ఉందని పేర్కొన్న యాసిమ్ ముర్తాజా.. ప్రత్యర్థి జట్టు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇన్నింగ్స్ తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు.
"ఆసియా కప్‌లో ఆడటం నిజంగా ఒక కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద టోర్నమెంట్లలో ఒకటి" అని ముర్తాజా మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో వెల్లడించాడు. అఫ్గానిస్తాన్ మొత్తం స్కోరుపై మాట్లాడుతూ, "నిజం చెప్పాలంటే ప్రత్యర్థి జట్టు నుంచి మేము అంత భారీ స్కోరును (188) ఊహించలేదు. మేము 150 పరుగుల లోపు ఉంటుందని అనుకున్నాం" అని పేర్కొన్నాడు. అయితే అజ్మతుల్లా ఒమర్జాయ్ మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్నే మార్చేసిందని ముర్జాజా ప్రశంసించాడు. ఒమర్జాయ్ కేవలం 20 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి, జట్టు స్కోరును భారీగా పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్ నుంచి తమకు కొన్ని సానుకూల అంశాలు లభించాయని ముర్తాజా తెలిపాడు. బ్యాటింగ్‌లో బాబర్ హయాత్ ప్రదర్శన, తమ స్పిన్నర్లు అద్భుతంగా రాణించడం తమకు దక్కిన మంచి విషయాలని ముర్తాజా చెప్పాడు. బాబర్ హయాత్ 39 పరుగులు చేయగా, స్పిన్నర్లు ఆరంభంలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు. మొత్తంగా హాంకాంగ్ జట్టుకు ఇది ఓ కఠినతరమైన ప్రారంభమైనప్పటికీ.. ఒమర్జాయ్ ఇన్నింగ్స్ తమను ఓటమి వైపు నెట్టిందని ఆ జట్టు కెప్టెన్ యాసిమా ముర్తాజా అంగీకరించాడు. అయితే టోర్నమెంట్‌లో తమ తదుపరి మ్యాచ్‌లకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మహమ్మద్ నబీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుష్ శుక్లా రెండేసి వికెట్లు తీయగా.. అతీక్ ఇక్బాల్, ఇషాన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. చెత్త ఫీల్డింగ్ హాంగ్ కాంగ్ కొంపముంచింది. మూడు సునాయస క్యాచ్‌లను హాంకాంగ్ ఫీలర్లు నేలపాలు చేశారు.
అనంతరం హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులే చేసి ఓటమిపాలైంది. బాబర్ హయత్(43 బంతుల్లో 3 సిక్స్‌లతో 39), కెప్టెన్ యాసిమ్ ముర్తాజా(16) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్(2/8), ఫజలక్ ఫరూఖీ(2/16) రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, తలో వికెట్ తీసారు. మరో ఇద్దరు బ్యాటర్లు రనౌటయ్యారు.