రాంచీ: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుచుకుంటారు. ఎంత ఒత్తిడిలో ఉన్న ధోని తన స్వభావంలో ఎటువంటి మార్పు లేకపోవడం వల్లే అభిమానులు అలా పిలుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ధోనిలో అందరికీ నచ్చే గుణం నిరాడంబరత.
ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన ధోనికి ఎంత ఫాలోయింగ్ ఉన్నా.. నిరాడంబరంగా జీవించడానికి ఎక్కువ ఆసక్తిని కనబర్చుతాడు. సొంతూరు జార్ఖండ్ వెళ్లినప్పుడు రాంచీ వీధుల్లో బైక్‌పై తిరుగుతుంటాడు. ఇప్పుడు హెయిర్ కట్ విషయంలో కూడా ధోని నిరాడంబరత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
వివరాల్లోకి వెళితే.. వీధిలో ఉండే బార్బర్‌తో తన ఇంట్లోనే హెయిర్ కట్ చేయించుకుంటున్న ఫోటో ఒకటి ధోని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌లాగా మారింది. ఎందుకంటే సెలబ్రిటీలకు ప్రత్యేకంగా హెయిర్ స్టైలిస్ట్స్ ఉంటారు. అందుకు ధోని కూడా భిన్నమేమి కాదు.

ధోనీకి కూడా సప్నా భవ్‌నాని అనే హెయిర్‌స్టైలిస్ట్ ఉంది. కానీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి హెయిర్ కట్ చేసుకోకుండా ఇంట్లోనే ఇలా సాధారణ వ్యక్తిలా వెంట్రుకలు కట్ చేసుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ధోని ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన తక్షణమే తెగ్ లైకులు వచ్చాయి.
ధోనీ నిరాడంబరతకు ఇది నిదర్శనమని కొందరంటే.. మరికొందరు ఏకంగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పోలుస్తూ తలైవార్ అని కామెంట్స్ పోస్ట్ చేయడం విశేషం.