హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ భార్య పోగొట్టుకున్న వాచ్‌ను తిరిగి దక్కించుకోవడంలో ట్విట్టర్ కీలకపాత్ర పోషించింది.
అసలేం జరిగింది?
గిల్‌క్రిస్ట్ తన భార్య మెల్, నలుగురు కుమార్తెలతో కలిసి హాలిడే ట్రిప్‌లో భాగంగా సౌత్ వెస్టన్ టౌన్ అయిన డన్స్‌బారో వెళ్లాడు. అక్కడ ఉన్న ఓవల్ మైదానంలో స్ప్రింట్ పోటీలు జరుగుతుండటంతో వాటిని చూసేందుకు మెల్ తన కుమార్తెను తీసుకుని వెళ్లింది.
తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆమె చేతికి పెట్టుకున్న వాచ్ కనిపించలేదు. ఆ వాచ్‌ని కొన్నాళ్ల క్రితం గిల్‌క్రిస్ట్ ఎంతో ప్రేమతో తన భార్యకు కానుకగా ఇచ్చాడు. విషయం తెలుసుకున్న గిల్‌క్రిస్ట్ వెంటనే ట్విటర్‌లో 'నా భార్య ఓవల్‌లో వాచ్ పోగొట్టుకుంది. ఎవరికైనా దొరికితే దయచేసి నాకు సమాచారం ఇవ్వండి' అని పేర్కొన్నాడు.
దీంతో అమీ ముండే అనే మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో 'ఓవల్‌లో ఎవరైనా వస్తువు పోగొట్టుకున్నారా. దాని వివరాలు చెప్పండి. నా దగ్గర ఉన్న వస్తువుతో మ్యాచ్ అయితే తిరిగి ఇచ్చేస్తా' అని తన ఫేస్ బుక్ పేజిలో పోస్టు చేసింది. ఈ పోస్టుని గుర్తించిన గిల్‌క్రిస్ట్ 'నాకు ఫేస్‌బుక్ ఖాతా లేదు. మీకెవరికైనా అమీ తెలిసి ఉంటే, నేను పోగొట్టుకున్న వస్తువు తెలుపు, సిల్వర్ రంగులు కలిసిన వాచ్ అని చెప్పండి' అని ట్విటర్‌లో తన ఫాలోవర్స్‌కు చెప్పాడు.
గిల్ క్రిస్ట్ ఫాలోవర్స్ ఈ విషయాన్ని అమీకి చెప్పడంలో సక్సెస్ అయ్యారు. దీంతో తన భార్యకు కానుకగా ఇచ్చిన వాచ్‌ని ఆమె తిరిగి గిల్‌క్రిస్ట్‌కు పంపించింది. ఆమె పంపిన వాచ్‌ని అందుకున్న గిల్‌క్రిస్ట్ 'థాంక్యూ ట్విటర్. వాచ్ దొరికింది. నాకు అందింది. సాయం చేసిన అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.