హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ సాధించిన విజయంతో పొరుగు దేశమైన పాకిస్థాన్ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానానికి చేరుకుంది.
భారత్ గెలిస్తే పాకిస్థాన్ అగ్రస్ధానం చేరుకోవడం ఏంటని అనుకుంటున్నారా. అవును నిజమే. పాకిస్థాన్ టీ20 ర్యాంకుల్లో అగ్రస్ధానానికి ఎగబాకింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
దీంతో గత మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పాక్ రెండో స్థానంలో నిలవగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగింది. ఈ రెండు జట్ల మధ్య పాయింట్ల పట్టికలో కొద్దిపాటి తేడా మాత్రమే ఉంది. అయితే తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఓటమి పాలై రండో స్థానానికి దిగజారింది.

124 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ అగ్రస్థానానికి చేరుకుంది. అయితే, టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ అగ్రస్ధానం దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌ను భారత్ గనుక క్లీన్ స్వీప్ చేస్తే ఐదో స్ధానంలో ఉన్న భారత్ రెండో స్ధానానికి చేరుకుంటుంది.
కాగా, ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 4 (శనివారం) రాజ్ కోట్ వేదికగా జరగనుంది.