
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్ధానమే సరైంది అని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కటక్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 93 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీ20ల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. అంతకముందు టీ20 వరల్డ్ కప్‌లో కొలంబోలో ఇంగ్లాండ్‌పై సాధించిన 90 పరుగుల విజయమే ఇప్పటివరకు భారత్‌కు అది పెద్ద విజయం. టీ20ల్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పటికీ ఓ పజిలే. తొలి టీ20లో నాలుగో స్ధానంలో క్రీజులోకి వచ్చి ధోని 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
చివర్లో ధోని ఫోర్లు, సిక్సులతో పరుగల వరద పారించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేయగలిగింది. అనంతరం 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16 ఓవర్లు మాత్రమే ఆడి 87 పరుగులకు ఆలౌటైంది.
దీంతో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే భారత్ ఇన్ని పరుగుల తేడాతో విజయం సాధించడానికి కారణం ధోని ఇన్నింగ్స్ కారణమని మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 'ధోని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో వన్డేల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా అతడి క్లాస్ అనేది పర్మినెంట్' అని అన్నాడు.
'చాలా కాలంగా ధోని మ్యాచ్‌లను ముగిస్తున్నాడు. అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని భావించి అతడిని ముందు పంపాం. నాలుగో స్థానమే అతడికి సరైంది. కేఎల్ రాహుల్ అద్భుతంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. వన్డే జట్టులో అతడికి చోటు దక్కలేదు. కానీ తానేంటో ఈ మ్యాచ్‌తో రాహుల్ నిరూపించాడు' అని రోహిత్ శర్మ అన్నాడు.
ఇదిలా ఉంటే తొలి టీ20లో అనేక రికార్డులను ధోని తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో స్ధానంలో ధోని బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. 11 ఇన్నింగ్స్‌ల్లో 244 పరుగులు చేశాడు (7సార్లు నాటౌట్‌గా నిలిచాడు). ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఫిబ్రవరి 1, 2017న బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్‌కీపర్ లేదా ఫీల్డర్‌గా ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 74 ఔట్లలో పాలుపంచుకున్న అతడు డివిలియర్స్ రికార్డు (72)ను అతడు బద్దలు కొట్టాడు. తొలి టీ20లో ధోని రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంప్‌లు చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.