
డెత్ ఓవర్లల్లో కొల్లాప్స్..
ఇవ్వాళ అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న న్యూజిలాండ్-ఐర్లాండ్ మ్యాచ్‌లో మరో హ్యాట్రిక్ నమోదైంది. ఇన్నింగ్ ఆరంభంలో దుమ్ముదులిపిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్.. డెత్ ఓవర్లల్లో కుప్పకూలిపోయింది. ఐర్లాండ్ బౌలింగ్‌కు దాసోహం అయింది. ప్రత్యేకించి- జోషువా లిటిల్.. తన బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 200లకు పైగా స్కోర్ సాధించేలా దూసుకెళ్తోన్న న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు కళ్లెం వేశాడు. ఫలితంగా- ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్దే నిలిచిపోయింది కివీస్ టీమ్ టార్గెట్.

ఈ టోర్నీలో రెండోసారి..
ఐర్లాండ్ బౌలర్లల్లో జోషువా లిటిల్- న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు అనూహ్యంగా బ్రేకులు వేశాడు. 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ తీసుకున్నాడీ లెఫ్ట్ హ్యండర్ ఫాస్ట్ బౌలర్. టీ20 ప్రపంచకప్ 2022లో హ్యాట్రిక్ నమోదు కావడం ఇది రెండోసారి. ఇదే టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ ఈ ఘనతను సాధించాడు. శ్రీలంకపై మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించాడు.

తొలి వికెట్‌గా..
రెండో బంతికి కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ పంపించాడు. మిడిల్ స్టంప్ మీద పడి ఇన్ స్వింగ్ అయిన బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి లేచిన ఆ బంతి నేరుగా డెలానీ చేతుల్లో వాలింది. మూడో బంతికి జేమ్స్ నీషమ్ అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్‌పై పిచ్ అయిన బంతిని ఆడలేకపోయాడు నీషమ్. అది నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి శాంట్నర్ కూడా అదే తరహాలో అవుట్ అయ్యాడు. దీనితో లిటిల్ తన రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

బ్రెట్‌లీ తో బిగిన్..
ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్స్‌లో హ్యట్రిక్ తీసిన బౌలర్లు అయిదుమంది ఉన్నారు. ఆ జాబితాలో ఆరో బౌలర్‌గా చేరాడు జోషువా లిటిల్. 2007లో టీ20 ప్రపంచకప్ ఆరంభ టోర్నమెంట్‌లోనే హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ బ్రెట్ లీ ఈ ఘనతను సాధించాడు. బంగ్లాదేశ్‌పై ఈ ఘనతను సాధించాడు. తొలి బంతికి షకీబుల్ హసన్, రెండో బంతికి ముష్రఫీ మొర్తాజా, మూడో బంతికి అలోక్ కపాలిని పెవిలియన్ దారి పట్టించాడు.

మళ్లీ 2021లోనే..
ఆ తరువాత టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్ కోసం సుదీర్ఘకాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. 2021లో ఐర్లాండ్ బౌలర్ కుర్టీస్ క్యాంఫర్ ఈ ఎదురుచూపులకు తెర దించాడు. నెదర్లాండ్స్‌పై వరుసగా నాలుగు బంతుల్లో నలుగురిని అవుట్ చేశాడు. కొలిన్ అక్కెర్‌మన్, ర్యాన్ టెన్ డెకాటె, స్కాట్ ఎడ్వర్డ్స్, వాన్ డెర్వ్ మెర్వ్‌ను వెనక్కి పంపించాడు. అదే టోర్నీలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ కూడా హ్యాట్రిక్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎయిడెన్ మార్క్‌రమ్, టెంబా బావుమా, డ్వైన్ ప్రిటోరియస్‌ను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అయినా గానీ ఈ మ్యాచ్‌ను ఓడిపోయారు లంకేయులు.

నెక్స్ట్ రబడ..
2021 ప్రపంచకప్‌లోనే దక్షిణాఫ్రికా బౌలర్ కగిసొ రబడ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై ఈ ఘనతను సాధించాడు. క్రిస్ వోక్స్, ఇవాన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్‌లను అవుట్ చేశాడు. ఫలితంగా- ఒక దశలో ఓడిపోతుందనుకున్న దక్షిణాఫ్రికా- ఈ వరుస వికెట్ల దెబ్బకు గెలుపుబాట పట్టింది. ఈ టోర్నమెంట్‌లోనూ రెండు హ్యాట్రిక్స్ రికార్డయ్యాయి. తొలి హ్యాట్రిక్‌ను యుఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ శ్రీలంకపై నమోదు చేయగా.. జోష్ లిటిల్ న్యూజిలాండ్ బ్యాటర్లను వరుస బంతులకు వెనక్కి పంపాడు.


Click it and Unblock the Notifications












