SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!

గతేడాది చివర్లో జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏరికోరి కొనుగోలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్. ఈ సౌతాఫ్రికా వెటరన్ ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేదు. భారత్‌లో జరిగిన సిరీస్‌లో మాత్రమే కొంత ఫర్వాలేదనిపించాడు. అయితే త్వరలో ఐపీఎల్ ప్రారంభం అవుతున్న సమయంలో అతను ఫామ్ అందుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న అతను ప్రిటోరియా క్యాపిటల్స్‌పై చెలరేగాడు.
చెలరేగిన బ్యాటర్లు..
సూపర్‌స్పోర్ట్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రిటోరియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ వెంటనే తమ నిర్ణయం సరైంది కాదని ఆ జట్టుకు తెలిసొచ్చింది. ఎందుకంటే డర్బన్ ఓపెనర్లు ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగారు. క్వింటన్ డీకాక్ (43), మెన్ మెక్‌డెర్మాట్ (41) ఇద్దరూ కూడా తమ జట్టుకు ధనాధన్ ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతుల్లోనే 104 పరుగులతో అజేయంగా నిలిచాడు.
భారీ స్కోరు చేసిన డర్బన్..
క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ప్రిటోరియా బౌలర్లు ఎంత కష్టపడినా క్లాసెన్‌ను ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. అయితే అతనికి సహకారం అందించడంలో డేవిడ్ విల్లీ (1), వియాన్ ముల్డర్ (9) విఫలమయ్యారు. అయితే చివర్లో మాథ్యూ బ్రీట్జ్ (46 నాటౌట్) కూడా చాలా వేగంగా ఆడాడు. దీంతో డర్బన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగులు చేసింది. ప్రిటోరియా బౌలర్లలో మిగుల్ ప్రిటోరియస్ రెండు వికెట్లతో రాణించగా.. జోషువా లిటిల్, జిమ్మీ నీషమ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఛేజింగ్‌లో చేతులెత్తేసిన ప్రిటోరియా..
లక్ష్య ఛేదనలో ప్రిటోరియా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫిల్ సాల్ట్ (1), కుశాల్ మెండిస్ (10) ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో ఒత్తిడిలో పడిన మిగతా బ్యాటర్లు కూడా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. థీనుస్ డి బ్రూన్ (16), రైలీ రూసో (18) మాత్రమే మిడిలార్డర్‌లో కొంత ఫర్వాలేదనిపించారు. చివర్లో ఈథన్ బోష్ (23) ఒక్కడే సత్తా చాటాడు. మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో ఆ జట్టు 15.1 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. డర్బన్ జట్టు ఏకంగా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ టీం బౌలర్లలో జూనియర్ డాలా మూడు వికెట్లు తీసుకోగా.. డ్వెయిన్ ప్రిటోరియస్, వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కీమో పాల్, రీస్ టాప్లీ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటుతో చెలరేగిన క్లాసెన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications