ఆసియా కప్ 2025లో భాగంగా కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టుపై శ్రీలంక అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్ మహ్మద్ నబీ సిక్సర్ల వర్షం కురిపించాడు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ దునిత్ వెల్లాలగే వేసిన చివరి ఓవర్‌లో మహ్మద్ నబీ సిక్సర్ల వర్షం కురిపించాడు. నబీ సిక్సర్లు బాదిన అదే బౌలర్‌కు సంబంధించి విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్ జరుగుతుండగా.. అతన తండ్రి సురంగ వెల్లాలగే గుండెపోటుతో కొలంబోలో కన్నుమాశారు. శ్రీలంక విజయ సంబరాలు చేసుకుంటున్న సమయంలో యువ క్రికెటర్ దునిత్ వెల్లాలగే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు.
మ్యాచ్ జరుగుతుండగానే అతడి తండ్రి తుదిశ్వాస విడవగా.. అయితే టీమ్ అధికారులు ఈ విషయాన్ని దునిత్ వెల్లాలగేకు మ్యాచ్ అనంతరం చెప్పారు. మ్యాచ్ మధ్యలోనే ఈ విషయం శ్రీలంక మేనేజ్మెంట్ కు తెలిసినప్పటికీ... మ్యాచ్ విజయం సాధించిన తర్వాత సమాచారం అందించడం గమనార్హం. దాంతో వెంటనే వెల్లాలగే ఫీల్డ్‌ను వదిలి తన తండ్రిని ఆఖరి చూపు చూసుకోవడానికి శ్రీలంక బయల్దేరి వెళ్లాడు. సమాచారం తెలిసిన వెంటనే దునిత్ వెల్లాలగే కన్నీళ్లు పెట్టుకోగా.. శ్రీలంక ప్లేయర్లు అతడిని ఓదార్చారు. అయితే దునిత్ వెల్లాలగే తండ్రి మృతి నేపథ్యంలో సూపర్-4కు దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్‌తో జరిగే కీలక పోరులో వెల్లాలగే అవసరం ఖచ్చితంగా ఉంది. గ్రూప్ దశలో శ్రీలంక జట్టు వరుసగా మూడు విజయాలతో స్టాండింగ్ విక్టరీని నమోదు చేసింది.

శ్రీలంక విజయం.. సూపర్-4లోకి ఎంట్రీ
ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన శ్రీలంక నేరుగా సూపర్-4లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచ మొదట బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ ఆరంభంలో తడిబడింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే చివర్లో రషీద్ ఖాన్, మహ్మద్ నబీల బ్యాటింగ్ తో జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు సాధించింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు అద్భుతం రాణించారు. ముఖ్యంగా కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 10 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుశాల్ పెరీరా(28), కమిందు మెండిస్(34) తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు సూపర్-4లోకి అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూప్ నుంచి బంగ్లాదేశ్ రెండో జట్టుగా సూపర్-4కు అర్హత సాధించింది.