మహిళల టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర! మొదటిసారి ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. సెమీఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా చేతితో ఓటమిపాలై వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన సెమీస్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో వరల్డ్ కప్‌లో తమ 15 వరుస విజయాలకు బ్రేక్ పడింది.
టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా అమ్మాయిల చేతిలో కంగారూలకు ఇదే తొలి ఓటమి. కాగా, ఇప్పటివరకు ఏడు టీ20 వరల్డ్ కప్‌లు జరగ్గా అందులో ఆరు సార్లు ఆస్ట్రేలియానే విజేత. ఒక్కసారి రన్నరప్‌గా నిలిచింది. కానీ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోవడంతో.. ఓటమి బాధతో ఆసీస్ అమ్మాయిలు నిరాశతో మైదానాన్ని వీడారు. డగౌట్‌లో కూర్చున్న కెప్టెన్ అలీసా హీలీ కన్నీటిని ఆపుకుంటూ భావోద్వేగాన్ని నియంత్రించుకుంది.

గాయం కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ సెమీఫైనల్స్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో తాహిలా జట్టును నడిపించింది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44; 42 బంతుల్లో, 2 ఫోర్లు ) టాప్‌స్కోరర్. ఎలిస్ పెర్రీ (31; 23 బంతుల్లో, 2 ఫోర్లు), తాలియా (27; 33 బంతుల్లో, 3 ఫోర్లు ) ఫర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖకా రెండు వికెట్లు తీసింది.
అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అనెకె బాష్ (74 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ వోల్వార్ట్ (42; 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)రాణించింది. తన్జిమ్ బ్రిట్స్ (15; 15 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆదిలోనే ఔటైనా వోల్వార్డ్, అనెకె.. ఆసీస్‌కు అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 65 బంతుల్లో 96 పరుగులు జోడించారు.
సెమీఫైనల్-2లో వెస్టిండీస్‌తో న్యూజిలాండ్ పోటీపడనుంది. షార్జా వేదికగా ఇవాళ రాత్రి 7.30 ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ సెమీస్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.