
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు కురిపించాడు. బరిలోకి దిగిన ప్రతిసారి ఆకట్టుకుంటున్నాడని కొనియాడాడు. అంతేకాకుండా టీంలో వెంకటేశ్ అయ్యర్ స్థానం విషయమై ద్రావిడ్ కీలక విషయాలను వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అయ్యర్ ఓపెనర్‌గా రాణిస్తున్నాడనే విషయం తెలుసన్నాడు. అలాగే టీమిండియాలో వెంకటేశ్ అయ్యర్ ఎలాంటి పాత్రకు సెట్ అవుతాడనే విషయమై ముందే పూర్తి క్లారిటీతో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో అయ్యర్ ఓపెనర్‌గా ఆడినప్పటికీ టీమిండియాలో అతనికి ఆ అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్థానాల్లో ఉన్న కీలక ఆటగాళ్లు రాణిస్తున్నారని ఆయన వివరించాడు.
దీంతో వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడిస్తున్నామని ద్రావిడ్ తెలిపాడు. కావాలనే మిడిలార్డర్‌లో ఆడించి అయ్యర్‌కు సవాల్ విసిరామని చెప్పాడు. దీంతో బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో ఆకట్టుకుంటూ అయ్యర్ ఎంతో మెరుగవుతున్నాడని ఆయన కొనియాడాడు. ఇది సంతోషించే విషయమని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. అలాగే వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్ విషయమై కూడా ద్రావిడ్ స్పందించాడు.
జట్టుకు అవసరమైనప్పుడు మాత్రమే ఆరో బౌలర్‌గా ఉన్న వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ఉపయోగించుకుంటాడని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. అలాంటి సమయంలో కూడా వెంకటేశ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని అన్నాడు. జట్టులో ఉండే ఆరో బౌలర్ ఎప్పుడైన సరే కీలక సమయాల్లో బౌలింగ్ చేయడానికి ఉపయోగపడతాడని తెలిపాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ సమయంలో ఆ సమయంలో వెంకటేశ్ అయ్యర్ 2.1 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని ఆయన కొనియాడాడు. ఇక విండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్ అయ్యర్ కెరీర్‌లో అద్భుతమైనదిగా నిలిచిపోతుందని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో కీలక సమయాల్లో అయ్యర్ రాణించాడు. సిరీస్ మొత్తంలో 92 పరుగులు చేశాడు. కాగా వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.