ఓ వైపు టీ20 సిరీస్ జరుగుతుండగానే ఫ్లైట్ ఎక్కిన ప్లేయర్లు
ఇకపోతే రాహుల్ ద్రావిడ్ భారత శిబిరంలో చేరడానికి ముందు ఇంగ్లాండ్‌లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లను బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ నిర్వహించారు. ఇక రిషబ్ పంత్ నేతృత్వంలోని టీమిండియా జట్టు భారతదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న టైంలోనే విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్‌లతో సహా టెస్ట్ రెగ్యులర్ సభ్యులు ఇంగ్లాండ్‌కు బయలుదేరారు.

ముందు కోహ్లీ బ్యాచ్.. తర్వాత రోహిత్
జూన్ 16న కోహ్లీతో సహా ఓ బ్యాచ్ ముంబై నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరగా, రోహిత్ ఒక రోజు తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. టీ20 సిరీస్లో ఆడిన పంత్, శ్రేయాస్ అయ్యర్ కూడా సోమవారం బెంగళూరు నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరారు. లండన్‌లో టీమిండియా ప్లేయర్లు తమ శిక్షణ ప్రారంభించారు. ఇక సోమవారం లీసెస్టర్‌షైర్లో భారత శిబిరం తన ప్రాక్టీసు ముమ్మరం చేసింది. జూన్ 24న లీసెస్ట్ షైర్ కౌంటీ జట్టుతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తదనంతరం జూలై 1నుండి ఇంగ్లాండ్ టెస్ట్ టీంతో 5వ టెస్టులో తలపడనుంది.

ఆ ప్లేయర్లు ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు
గతేడాది కోవిడ్ -19 వ్యాప్తి వల్ల 5వ టెస్టు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటిక2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. అప్పుడు రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక ప్రస్తుతం ద్రావిడ్ ఆ స్థానంలో ఉండడంతో అతనిపై ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. 'ఈ టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది' అని ద్రావిడ్ ఆదివారం రీషెడ్యూల్ చేసిన టెస్ట్ గురించి మాట్లాడాడు. 'మాకు ఇది ఒక మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్, కానీ ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో పాయింట్లు ఇచ్చే మ్యాచ్. గతంలో ఈ సిరీస్లో భాగమైన ప్లేయర్లు ఎలాగైనా ఈ సిరీస్‌ని గెలిచి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించాలని చూస్తున్నారు.' అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ చాలా బలపడింది.. టీమిండియా చెమటోడ్చాల్సిందే
ఇక కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు కొత్త ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలో ఇంగ్లాండ్ చాలా బాగా బలపడింది. చాలా దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి మంచి విజయోత్సాహంతో ఉన్నారు. చివరి గేమ్‌లో లీడ్స్‌లో జరగనుండగా.. ఇప్పటికే సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉన్నారు.
ఆ జట్టు స్టార్ ప్లేయర్లు స్టోక్స్, రూట్, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ మంచి లయలో కన్పిస్తున్నారు. ఇక పాట్స్ లాంటి యువ బౌలర్ కన్సిస్టెన్సీగా వికెట్లు తీస్తున్నాడు. ఇక బెయిర్ స్టో ఒంటి చేత్తో టెస్టుల్లోనూ గెలిపించగలనని రెండో టెస్టులో చూపించాడు. దీంతో టీమిండియా ఇంగ్లాండ్ మీద గెలవాలంటే.. భారత ప్లేయర్లు తమ అత్యుత్తమ ఆట కనబరిచి తీరాల్సిందే.


Click it and Unblock the Notifications












