
జోహన్నెస్‌బర్గ్: రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్‌తో డకౌట్ అయ్యాడు. కేవలం 3 బంతులు ఎదుర్కొన్న పంత్.. రబాడ బౌలింగ్‌లో అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో పంత్ షాట్ సెలెక్షన్ విధానంపై తాజాగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఆ విషయమై పంత్‌తో మేనేజ్‌మెంట్ చర్చలు జరపనున్నట్టు వెల్లడించాడు. రిషబ్ పంత్ ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటాడని, దాని వల్లే అతతు సక్సెస్ కూడా అవుతున్నాడని చెప్పుకొచ్చాడు. రిషబ్ దూకుడుగా ఆడకూడదని ఎవరూ చెప్పడంలేదని, కానీ సరైన సమయంలో సరైన షాట్ ఎంచుకోవాలని ద్రావిడ్ సూచించాడు. అతను క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించకపోవడం బెటర్ అని, క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడాలన్నాడు. రిషబ్ పంత్ గురించి తమకు తెలుసన్న ద్రావిడ్ అతనో భిన్నమైన ఆటగాడని చెప్పాడు. అంతేకాకుండా తన దూకుడైన ఆట తీరుతో తక్కువ సమయంలోనే మ్యాచ్ గమనాన్ని మార్చగలడని ద్రావిడ్ కొనియాడాడు. అలాగే ప్రస్తుతం పంత్ నేర్చుకుంటున్నాడని, ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడని, తన ఆటను మెరుగు పరుచుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అలాగే జోహన్నెస్ బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి గురించి ద్రావిడ్ స్పందించాడు. ఆ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం ఇరు జట్లకు సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తమ బ్యాటర్లు ఇంకో 60 నుంచి 70 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే బాగుండేదని అన్నాడు. అటు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే చెప్పాడు. అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అలాగే హనుమ విహారీ రెండు ఇన్నింగ్స్‌ల్లో బాగా ఆడాడని ద్రావిడ్ కొనియాడాడు. అవసరమైనప్పుడు యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారని ద్రావిడ్ అన్నాడు. ఇక చివరి టెస్టు మ్యాచ్‌లో రాణించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే చివరి టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. అతడు గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు.
కాగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన సెకండ్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ విసిరిన 240 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సునాయసంగా చేధించింది. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి 1-1తో సమం అయింది. ఈ నెల 11 నుంచి కేప్ టౌన్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది.