8 వికెట్లు.. నాలుగు పరుగులు:
చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్ విజయానికి చేతిలో 8 వికెట్లు ఉండగా.. నాలుగు పరుగులే అవసరమయ్యాయి. అప్పటికి ఇడెన్ మార్‌క్రమ్ (26; 20 బంతుల్లో 2x4, 1x6), నికోలస్ పూరన్ (32; 22 బంతుల్లో 1x4, 2x6) క్రీజులో ఉన్నారు. దీంతో అంతా పంజాబ్ జట్టే విజయం సాధిస్తుందని భావించారు. కానీ ఆ ఓవర్‌లో కార్తీక్ త్యాగి మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతిని డాట్ బాల్‌గా వేయగా.. రెండో బంతికి మార్‌క్రమ్ సింగల్ తీశాడు. మూడో బంతికి పూరన్ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా (0) నాలుగో బంతికే పరుగులేమి చేయలేదు. ఇక ఐదో బంతికి అతడు డకౌటయ్యాడు. దీంతో ఒక బంతికి మూడు పరుగుల చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
రవి, గేల్‌కు దక్కని చోటు:
తుది జట్టులో క్రిస్ గేల్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టాస్ అనంతరం పీటర్సన్ మాట్లాడుతూ.. గేల్ తీవ్ర నిరాశకు గురై ఉంటాడన్నాడు. అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదనే ప్రశ్నలు పంజాబ్‌కు ఎదురవుతాయని తెలిపాడు. పుట్టిన రోజు నాడు అతడిని పక్కకు పెట్టడం అర్థం కాలేదన్నాడు. ఒక్క మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సి వస్తే.. అది ఈ మ్యాచే అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. గేల్ విషయంలో తాను కూడా ఆశ్చర్యపోయానని గవాస్కర్ కూడా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఎంపిక చేసిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లేనని, అయితే గేల్‌ను అతడి పుట్టిన రోజున పక్కనపెట్టడం సరికాదన్నాడు.
ఇలాంటి కోచ్ టీమిండియాకు అవసరమా:
కింగ్స్ పంజాబ్ తుది జట్టులో క్రిస్ గేల్, రవి బిష్ణోయ్ లాంటి కీలక ఆటగాళ్లను హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఎంపిక చేయకపోవడాన్ని ఆ జట్టు అభిమానులకు మింగుడుపడడం లేదు. సామాజిక మాధ్యమాల్లో అతడి కోచింగ్ సామర్థ్యాన్ని నిందిస్తున్నారు. కుంబ్లే త్వరలో టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకునేముందు ఓసారి ఆలోచించాలని కొందరు ఫాన్స్ కోరుతున్నారు. 'సరైన జట్టును ఎంపిక చేయలేకపోతే ఇక కోచ్ ఎందుకు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి.. ప్రవీణ్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంటాడు! ఇలాంటి కోచ్ టీమిండియాకు అవసరమా? అని ఇంకొకరు కామెంట్ చేశారు. అనిల్ కుంబ్లే బదులుగా బీసీసీఐ మరొకరిని ప్రయత్నించాలని ఫాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
టీమిండియా కోచ్‌గా కుంబ్లే?:
వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోరనునట్లు సమాచారం తెలుస్తోంది. కోచ్ రేసులో జంబోనే ముందున్నాడట. ఇంతకముందు కుంబ్లే టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2016-17 మధ్య భారత జట్టు ప్రధాన కోచ్‌గా జంబో ఏడాది కాలం పనిచేశాడు. ఆ సమయంలో సచిన్ టెండ్యూలర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ.. కుంబ్లేను నియమించింది. అయితే అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లీకి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications












