
ధోనీ వయసైపోయిందంటూ జోక్‌లు:
క్వారంటైన్‌లో ఉన్న ఎంఎస్ ధోనీ.. తెల్లగడ్డంతో ఉన్న ఫొటోను అతడి భార్య సాక్షి సింగ్ ధోనీ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసారు. కూతురు జీవాతో కలిసి మహీ గార్డెన్‌లో సరదాగా ఆడుకుంటున్న వీడియోని కూడా పోస్ట్ చేసారు. నిమిషాల వ్యవధిలోనే ఆ ఫొటో, వీడియో వైరల్‌గా మారగా.. 38 ఏళ్ల ధోనీ తెల్ల గడ్డంతో న్యూలుక్‌లో కనిపించాడు. మహీ లాక్‌డౌన్ లుక్‌ను చూసిన నెటిజన్లు.. అతడిలో క్రికెట్ ఆడే ఆసక్తి కనిపించడం లేదని ఘాటుగా కామెంట్లు చేసారు. కొందరైతే తెల్లగడ్డం చూసి ధోనీ వయసైపోయిందంటూ జోక్‌లు పేల్చారు.

నా బిడ్డకి వయసేం అయిపోలేదు:
ఎంఎస్ ధోనీ వయసు గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడంతో అతని తల్లి దేవకి దేవి తాజాగా స్పందించారు. నా బిడ్డకి వయసైపోలేదని, కొడుకులో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నమ్ముతున్నట్టు చెప్పారు. 'మహీ కొత్త లుక్ చూశా. అంత వయసు మీరిన వాడేమీ కాదు. కొడుకెప్పుడూ తల్లికి చిన్న పిల్లవాడే. టీ20 ప్రపంచకప్ ఆడతాడో? లేదో? తెలియదు. రిటైర్మెంట్ గురించి సరైన సమయంలోనే ధోనీ నిర్ణయం తీసుకుంటాడు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ధోనీకి బాగా తెలుసు' అని దేవకి అన్నారు.

తెల్ల గడ్డంతో కొత్త లుక్:
తాజాగా నెట్టింట్లో ధోనీ ఓ కొత్త లుక్‌తో దర్శనమిచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. తన కూతురు జీవా సింగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియోలో ధోనీ తన ముద్దుల కుమార్తెతో, పెంపుడు కుక్కతో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతూ కనిపించాడు. సుమారు రెండు నిముషాలకు పైన సాగే ఈ వీడియోలో మహీ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్‌గా టీషర్ట్, లూజ్ ప్యాంట్‌లో నెరిసిన గడ్డంతో కనిపించాడు.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 ప్రపంచకప్ రేసులో ఉన్నాడు.

ప్రపంచకప్ ఆశలపై కరోనా కాటు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.


Click it and Unblock the Notifications
