India vs England: అతడు ప్రసిద్ధ్ కృష్ణ కాదు.. కరిష్మా: షోయబ్ అక్తర్

కరాచీ: టీమిండియా అరంగేట్ర పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతడు ప్రసిద్ధ్ కృష్ణ కాదు.. కరిష్మా అని పేరొన్నాడు. కరిష్మా అంటే హిందీలో అద్భుతం అని అర్థం. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 8.1 ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. మొదటి మూడు ఓవర్లలలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా.. ఆపై అద్భుతంగా పుంజుకున్నాడు.

జట్టుకు బ్రేక్ ఇచ్చాడు:
తొలి వన్డేతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పాతికేళ్ల ప్రసిద్ధ్ కృష్ణ.. తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (46), జానీ బెయిర్‌స్టో (94) విధ్వంసం సృష్టించడంతో 14 ఓవర్లకే 135 పరుగులు చేసింది. తొలుత తన మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేసిన ప్రసిద్ధ్.. కీలక సమయంలో రాయ్‌ను ఔట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను వెనక్కి పంపి భారత్‌లో ఉత్సాహం నింపాడు. ఆపై సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కరన్ (11) వికెట్లు తీశాడు. చివరకు భారత్ 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది.

ప్రసిద్ధ్ కృష్ణ కాదు.. కరిష్మా:
షోయబ్ అక్తర్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శన గురించి మాట్లాడాడు. 'అతడు ప్రసిద్ధ్ కృష్ణ కాదు.. కరిష్మా. ఆదిలో ఇంగ్లండ్ ఓపెనర్లు అతడి బౌలింగ్‌ను చితకబాదారు. ఆ తర్వాతి స్పెల్‌లో అద్భుతంగా తిరిగొచ్చాడు. మంచి బంతులతో ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్ తన తొలి వన్డేలోనే అద్భుత ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్‌గా మనమేంటో తెలియజేయాలి. నీ నైపుణ్యం, సత్తా చూపించాలి. ఒకసారి ధారాళంగా పరుగులిచ్చాక.. మళ్లీ తిరిగొచ్చి వికెట్లు తీయగలనని నిరూపించాలి' అని అక్తర్ అన్నాడు.

ఆధిపత్యం చెలాయిస్తే కుంగిపోకు:
'ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీసిన తీరు నిజంగా అద్భుతం. చాలా బాగా బౌలింగ్ చేశాడు. దీన్ని ఇలాగే కొనసాగించాలి. ప్రసిద్ధ్‌కు ఓ విషయం చెప్పాలి.. ఎప్పుడైనా బ్యాట్స్‌మెన్ నీపై ఆధిపత్యం చెలాయిస్తే కుంగిపోకు. వికెట్లపై దృష్టిసారించి వాటికేసే బంతులు విసురు. ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు ఇదే చిట్కా పాటించు' అని ప్రసిద్ధ్‌కు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సూచించాడు. భారత్ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా ప్రసిద్ధ్ రికార్డు నెలకొల్పాడు. 1997లో వెస్టిండీస్‌పై స్పిన్నర్ నోయల్ డేవిడ్ 3/21తో ఇప్పటి వరకూ టాప్‌లో ఉన్నాడు.

నమ్మకం కోల్పోలేదు:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ... 'తొలి వన్డేలో ఆరంభం బాలేదు. మేం సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేయకపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు విధ్వంసకరంగా ఆడారు. అయినా మేం నమ్మకం కోల్పోలేదు. వరుసగా వికెట్లు తీయడంతో జట్టుకు మేలు జరిగింది. ఫుల్లర్ లెంగ్త్ బంతులు వేయొద్దని మూడో ఓవర్ తర్వాత అర్థం చేసుకున్నా. ఆ తర్వాత సరైన ప్రాంతాల్లో బంతులు విసిరి ఫలితం సాధించాను' అని తెలిపాడు. ఐపీఎల్ అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications