తొలి టీ20లో భారత్ ఓటమి: ధోని అతి విశ్వాసమే కొంప ముంచిందా?


హైదరాబాద్: ధోని అతి విశ్వాసమే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమికి కారణమైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. వరుసగా వికెట్లు నేలకూలుతున్న దశలో ధోని క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ భారీ స్కోరు దిశగా నడిపించలేకపోయాడు.
తొలి టీ20లో ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్న ధోని పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వేగంగా ఆడాల్సిన టీ20 ఫార్మాట్‌లో 37 బంతులాడి 29 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఆటలో వేగం తగ్గింది. దీనిలో ఒకే ఒక్క సిక్స్ ఉండటం, ఫోర్లేమీ లేకపోవడం గమనార్హం. చివర్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ లేని స్థితిలో ధోని చెలరేగాల్సింది పోయి వచ్చే పరుగులను కూడా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది.

మరో 10 పరుగులైనా జతయ్యేవి
ధోని ఆడిన కొన్ని బంతులకు సింగిల్స్, డబుల్స్ తీసుంటే కనీసం మరో 10 పరుగులైనా జతయ్యేవని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఔటైన తరవాత ధోని క్రీజులోకి వచ్చాడు. అప్పటికే 10 ఓవర్లు పూర్తయయ్యాయి. భారత్ స్కోరు 80/3. క్రీజులో ధోని ఉన్నప్పటికీ మిగిలిన 10 ఓవర్లలో భారత్ కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగింది.

20వ ఓవర్ వరకూ భారత్ ఖాతాలో ఒక్క ఫోర్ లేదు
11వ ఓవర్ మొదలుకొని 20వ ఓవర్ మొదలయ్యే వరకూ భారత్ ఖాతాలో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం. 12వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఔటైన తరవాత భారత్ స్కోరు బోర్డు వేగం మరింతగా తగ్గింది. దినేశ్ కార్తిక్ (1), కృనాల్ పాండ్యా (1) క్రీజులోకి వచ్చిన వెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో క్రీజులో ఉన్న ధోని సింగిల్స్, డబుల్స్ తీసే అవకాశం వచ్చినా పరుగులు చేసేందుకు కదల్లేదు.

ధోని ఆలోచన అదే
ఇందుకు కారణం స్ట్రైకింగ్‌కి ఉమేశ్ యాదవ్, చాహల్ లాంటి బౌలర్లు వచ్చినా ఏమీ చేయలేరనేది ధోనీ ఆలోచన. అందుకే తనే క్రీజులో ఉండి బౌండరీలు బాదడానికి ప్రయత్నించాడు. 19వ ఓవర్‌లో ఇలాగే నాలుగు పరుగులను జట్టు కోల్పోయింది. కానీ, ఒక్కటంటే ఒక్క షాట్ కూడా కనెక్ట్ కాలేదు. ఎట్టకేలకు చివరి ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదగా 64 బంతుల తర్వాత బౌండరీ వచ్చినట్టయింది.

ధోని కావాలనే పరుగు తీయలేదు
ఇక ఐదో బంతిని గాల్లోకి లేపగా జంపా క్యాచ్ పడతాడని భావించి పరుగే తీయలేదు. ఇక్కడ సులువుగా రెండు పరుగులు వచ్చేవి. చివరికి మ్యాచ్ ఫలితంలో ఈ రెండు పరుగులే నిర్ణాయగా మారాయి. అయితే, తొలి టీ20 ఓటమిని ధోనికి ఆపాదించడం సరైంది కాదు. వైజాగ్ వికెట్ చాలా స్లోగా ఉంది. ధోనియే కాదు, భారత బ్యాట్స్‌మన్ మొత్తం పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు.

అందుకే ధోని నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది
వికెట్ పడకుండా కాపాడుకునే క్రమంలో ధోని నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టుకు విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ ఆ పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ విజయం సాధించింది. 19వ ఓవర్ వేసిన బుమ్రా అద్భుతంగా వేసి భారత్ గెలుపు బాటలో నడిచేలా చేశాడు. కానీ, ఉమేశ్ యాదవ్ దానిని తలకిందులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications