
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన 'చిన్న పిల్లాడు' వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. యాసెష్ సిరీస్ ఓటమి అనంతరం జో రూట్ చెప్పిన కారణాలు చిన్నపిల్లాడి మాటల్ని తలపించాయని పాంటింగ్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పెర్త్ టెస్టు అనంతరం పాంటింగ్ మాట్లాడుతూ 'జో రూట్ గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాడు. యాషెస్ సిరీస్ పోరు అంటేనే ఇది. అతను ఇప్పటి వరకు ఆడిన క్రికెట్ ఒక ఎత్తు.. యాషెస్ ఒక ఎత్తు. సిరీస్‌లో మ్యాచ్ తీవ్రత.. ఒత్తిడి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సిరీస్ ఓడిన తర్వాత.. రూట్ చెప్పిన సమాధానాలు చిన్న పిల్లాడి మాటల్లా ఉన్నాయి' అని అన్నాడు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై జో రూట్ స్పందించాడు. అతనికి ఇంగ్లాండ్ జట్టు, డ్రెస్సింగ్ రూము వాతావరణం గురించి ఏం తెలుసని ఆ వ్యాఖ్యలు చేశాడాని జో రూట్ మండిపడ్డాడు. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు జో రూట్ సోమవారం మీడియాతో మాట్లాడాడు.
'పాంటింగ్ అతని అభిప్రాయాన్ని చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టుతో లేదా డ్రెస్సింగ్ రూములో ఏనాడైనా ఒక్క క్షణమైనా అతను గడిపాడా? కాబట్టి అతడి మాటల్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరు ఎవరిని అడిగినా.. కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్లేయర్లు మాత్రమే నా వెనుక ఉన్నారని చెబుతారు' అని జో రూట్ అన్నాడు.
'ఇక, చిన్నపిల్లాడిలా మాట్లాడానని అంటున్నాడు కదా? నా తీరు అంతే. నాకు తెలియని భావ వ్యక్తీకరణని మీడియా ముందు ఎవరి కోసమో ప్రయత్నించాల్సిన అవసరం నాకు లేదు. జట్టుని ముందుండి ఎలా నడిపించాలో నాకు తెలుసు. ఇకపై కూడా అదే పని చేస్తా' అని జో రూట్ ఘాటుగా బదులిచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.